డిపాజిట్‌ సొమ్ము ఎక్కడ? 

A Officer Escape With Post Office Holders Money In Medak - Sakshi

సాక్షి,  రేగోడ్‌(మెదక్‌) : పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ అంటేనే నమ్మకం. ఎన్నో ఏళ్లుగా ప్రజల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ. అలాంటి సంస్థలో వినియోగారుల సొమ్ము స్వాహా చేసిన సంఘటన రేగోడ్‌ పోస్టాఫీస్‌లో చోటు చేసుకుంది. ఓ అధికారి వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి డబ్బులు స్వాహా చేసినట్లు ఆరోణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగంపై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా కనీసం విచారణకు నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.  

డబ్బు ఇవ్వకుండా మోసం.. 
మండల కేంద్రమైన రేగోడ్‌లో పోస్ట్‌ఆఫీస్‌లో ఓ అధికారి సబ్‌ పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే పోస్ట్‌ ఆఫీస్‌కు వెళ్లి జమ కోసం ఇచ్చిన డబ్బులు, విత్‌డ్రా కోసం ఓచర్‌లపై సంతకాలు చేసినా డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.  

పదిహేను రోజులు దాటినా.. 
డబ్బులు రాకపోవడంతో సంబంధిత స్థానిక పోస్ట్‌ ఆఫీస్‌ అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేసి పదిహేను రోజులు దాటినా స్పందించడం లేదని తెలుస్తోంది. కష్టపడి జమచేసుకున్న డబ్బులు తమకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. డబ్బులకోసం ఫోన్‌చేస్తే ఇష్టానుసారంగా అధికారి మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

పన్నెండు మంది వినియోగదారుల సొమ్ము.. 
7 గ్రామాలు, 12 మంది వినియోగదారులకు సంబంధించిన రూ.3లక్షల 79వేల 300లను అధికారి స్వాహా చేసినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గతరెండు నెలలుగా తమ డబ్బులు తమకు ఇవ్వాలని పోస్ట్‌ఆఫీస్‌కు తిరుగుతున్నా పోస్ట్‌ఆఫీస్‌లో కనిపించడం లేదు. అక్కడ సిబ్బందిని అడిగినా అధికారి ఈ రోజు, రేపు వస్తాడని చెబుతున్నాడని
 పేర్కొన్నారు.   

నేను ఏ తప్పూ చేయలేదు
ఈ విషయమై స్థానిక సబ్‌ పోస్ట్‌మాస్టర్‌ కృష్ణను సోమవారం వివరణ కోరగా.. ఆరోగ్యం బాగాలేక సెలవులో ఉన్నానని, అంతే తప్ప నేను ఏ తప్పు చేయలేదని తెలిపారు. కొందరు కావాలని నాపై లేనిపోనివి చెబుతున్నారని. ఆధారాలు ఉంటే చూపించాలని తెలిపారు.

ఓచర్‌పై సంతకం తీసుకుని ఇవ్వడం లేదు 
సుమారు 2000 సంవత్సరంలో రేగోడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో జీవిత బీమాలో డబ్బులను జమ చేశాను. గత 19 ఏళ్లుగా జమ చేస్తూనే ఉన్నా. ఇటీవల పాలసీ పూర్తయింది. దీంతో గతనెలలో డబ్బులు తీసుకునికి పోస్ట్‌ఆఫీస్‌కు వెళ్తే ఓచర్‌పై సంతకం తీసుకుని డబ్బులు లేవని, పైనుంచి రాగానే ఇస్తానని తెలిపారు. డబ్బుల కోసం మళ్లీ పోస్ట్‌ఫీస్‌కు వెళ్తే అధికారి లేరు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాం.  
– భారతమ్మ, పోచారం  

విచారణకు ఆదేశించాం.. 
రేగోడ్‌ సబ్‌ పోస్ట్‌మాస్టర్‌ కృష్ణ అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది.అయితే కృష్ణ నిజంగా అవకతవకలకు పాల్పడ్డారా? లేదా? అనే విషయమై వాస్తవాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించాం. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం.  
– బీవీ రమణ, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌ (ఎస్‌పీ) 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top