ఎల్‌ఆర్‌ఎస్‌కు ఎన్‌ఓసీ కష్టాలు 

NOC Problems To Telangana LRS clearance - Sakshi

రెవెన్యూ శాఖ చుట్టూ తిరుగుతున్న హెచ్‌ఎండీఏ సిబ్బంది.. 

స్పందించని అధికారులు  

నత్తనడకన 9 వేల దరఖాస్తుల పరిష్కారం  

రెండు విభాగాల్లోనూ సమన్వయ లోపం 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల క్లియరెన్స్‌కు రెవెన్యూ శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు(ఎన్‌ఓసీ) తేవడం కష్టంగా మారింది. రెండు నెలలుగా ఆయా జిల్లాల్లోని తహసీల్దార్, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా కేవలం మల్కాజిగిరి మేడ్చల్‌ జిల్లా నుంచి 183 ఎన్‌ఓసీలు రావడం తప్ప ఇతర జిల్లాల నుంచి కనీస స్పందన రాకపోవడం గమనార్హం. గత నెల 31న ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ గడువు ముగియడంతో ప్రాసెస్‌లో ఉన్న 9 వేల ఎన్‌ఓసీల ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు మరోసారి అవకాశమివ్వాలంటూ హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి. చిరంజీవులు ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఆగస్టు 31 వరకు గడువునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్ల మార్గదర్శనంలో తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులను కలిసి సాధ్యమైనంత తొందరగా ఎన్‌ఓసీలు తేవాలని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ ప్లానింగ్‌ విభాగ సిబ్బందిని ఆదేశించారు. అయితే ప్లానింగ్‌ విభాగంలో సిబ్బంది కొరత వల్ల పని వేగవంతం కావడం లేదు. వంద మందికిపైగా సిబ్బంది అవసరమున్నా ప్లానింగ్‌ విభాగంలో కేవలం 33 మందే పనిచేస్తున్నారు. వీరు అటు డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం సేవలు, ఇటు ఎల్‌ఆర్‌ఎస్‌ పనులు చూసుకోవడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఇంత తీరిక లేని పనుల్లో ఉంటూ ఎన్‌ఓసీల కోసం తహసీల్దార్ల కార్యాలయాల చుట్టూ తిరుతుంటే అక్కడి సిబ్బంది రేపు, మాపు అంటూ తిప్పుకొంటూ కాలాయాపన చేస్తున్నారు.  

తప్పని ఆపసోపాలు  
హెచ్‌ఎండీఏ చొరవ తీసుకున్న తొమ్మిదివేల దరఖాస్తులకు నిరంభ్యతర ధ్రువీకరణ పత్రాలు(ఎన్‌ఓసీ) తెచ్చుకునే విషయంలో ఆ సంస్థ ఆపసోపాలు పడుతోంది. ఇన్నాళ్లు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు ఎదుర్కొన్న అనుభవాలే హెచ్‌ఎండీఏకూ ఎదురవుతుండడంతో సిబ్బందికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆయా జిల్లాల కలెక్టర్లు కింది స్థాయి సిబ్బంది ఆదేశించినా ఆశించిన స్థాయిలో వారి నుంచి స్పందన రావడం లేదు. సామాన్యుడి మాదిరిగానే హెచ్‌ఎండీఏ అధికారులు వారిచుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఒక్క మేడ్చల్‌ జిల్లా నుంచి తప్ప రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల నుంచి ఇప్పటి దాకా ఒక్క ఎన్‌ఓసీ కూడా తేలేకపోయారు.  

ఫీజు కట్టనివారికి అవకాశం 
గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ ఇనిషియల్‌ పేమెంట్‌ చెల్లించని కారణంతో తిరస్కరణకు గురైన 9,842 దరఖాస్తులను ప్రాసెస్‌ చేయాలంటూ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ దరఖాస్తుదారులు రూ.10 వేల ఫీజు చెల్లిస్తే దరఖాస్తులను ప్రాసెస్‌ చేస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు హెచ్‌ఎండీఏకు ఎల్‌ఆర్‌ ఫీజుల రూపంలో రూ.691 కోట్లు, నాలా చార్జీల రూపంలో రూ.246 కోట్లు వచ్చాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top