మోత, రాత లేదిక!

No bag and no homework to CBSE schools - Sakshi

    సీబీఎస్‌ఈ స్కూళ్లలో రెండో తరగతి వరకు నో బ్యాగ్, నో హోంవర్క్‌

    ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి కొత్త విధానం

సాక్షి, హైదరాబాద్‌: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) స్కూళ్లలో ఒకటి, రెండో తరగతి చిన్నారులకు బండెడు పుస్తకాల మోత, పేజీలకొద్దీ హోంవర్క్‌ రాత నుంచి ఊరట లభించింది. వారు ఇక వీపులు ఒంగిపోయేలా బ్యాగుల భారం మోయాల్సిన పనిలేదు. చిట్టిచిట్టి చేతులు నొప్పిపుట్టేలా హోంవర్క్‌ రాయాల్సిన అవసరంలేదు. ఇకపై వారు స్కూల్‌ టైమ్‌ ముగిసిన వెంటనే ఇంటికొచ్చి ఎంచక్కా ఆటపాటలతో గడిపేయొచ్చు. ఎందుకంటే... సీబీఎస్‌ఈ యాజమాన్యం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నో స్కూల్‌ బ్యాగ్, నో హోంవర్క్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఎస్‌ఈ పరిధిలోకి వచ్చే స్కూళ్లన్నీ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని బోర్డు స్పష్టం చేసింది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఆర్మీ స్కూళ్లతోపాటు సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న ప్రతి స్కూల్లో నో స్కూల్‌ బ్యాగ్, నో హోంవర్క్‌ విధానం అమల్లోకి రానుంది. 

కోర్టు తీర్పుతో కదలిక... 
నో స్కూల్‌ బ్యాగ్, నో హోంవర్క్‌ విధానంపై సీబీఎస్‌ఈ గతంలోనే స్పష్టత ఇచ్చింది. చిన్న పిల్లలకు బరువైన పుస్తకాల బ్యాగు వద్దని, వీలైనంత వరకు తగ్గించాలని సూచించినప్పటికీ క్షేత్రస్థాయిలో విద్యా సంస్థలు ఈ నిబంధనలను పాటించలేదు. ఈ క్రమంలో కొందరు విద్యావేత్తలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించడంతో ఇటీవల తీర్పు ఇచ్చింది. దీంతో స్పందించిన సీబీఎస్‌ఈ యాజమాన్యం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రెండో తరగతి వరకు నిబంధనలు పరిమితం చేసినప్పటికీ మిగతా తరగతులకు సంబంధించి స్పష్టత ఇవ్వలేదు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థుల బ్యాగుల బరువు పరిమితికి మించి ఉన్నట్లు విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పదో తరగతి వరకు బ్యాగుల బరువు ఎంత ఉండాలనే అంశంపై స్పష్టత ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top