వారణాసిలో పసుపు రైతుల నామినేషన్‌

Nizamabad Farmers Will Contest From Varanasi Lok Sabha Seat - Sakshi

వారణాసి(ఉత్తర్‌ ప్రదేశ్‌): ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానంలో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పసుపు రైతులు సోమవారం నామినేషన్లు వేయనున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు అనే ప్రధాన డిమాండ్‌తో వీరు మోదీపై పోటీకి దిగారు. పసుపు రైతుల రాష్ట్ర అధ్యక్షులు నర్సింహనాయుడు, జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి తదితరులు వారణాసి కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్‌ పత్రాలు తీసుకున్నారు. ఈ నెల 29న సుమారు 50 మంది పసుపు రైతులు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నిజామాబాద్‌ రైతులకు మద్ధతుగా తమిళనాడుకు చెందిన ఈరోడ్‌ రైతన్నలు శనివారం కలెక్టర్‌ ఆఫీస్‌కు వచ్చారు.

తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, పసుపు బోర్డు సమస్యను జాతీయస్థాయిలో నేతలు గుర్తించేలా చేసేందుకు పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల తొలిదశలో భాగంగా నిజామాబాద్‌లో సిట్టింగ్‌ ఎంపీ కవితపై 175 మంది రైతులు పోటీ చేసిన విషయం తెల్సిందే. అటు వెలిగొండ ప్రాజెక్టు సాధనకు ప్రకాశం జిల్లా అన్నదాతలు వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. నామినేషన్‌ వేసేందుకు వెలిగొండ ప్రాజెక్టు సాధన సమితి నేతలు వడ్డే శ్రీనివాసులు, కొల్లూరు రవికిరణ్‌ వర్మ ఇప్పటికే కాశీ వెళ్లారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top