పంచాయతీ ఎన్నికల్లో కొత్త రిజర్వేషన్లే.. !

New Reservations In Panchayat Election In Nizamabad - Sakshi

పాత రిజర్వేషన్లకు చెల్లు

జీపీల సంఖ్య పెరగడమే కారణం

రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలు 

జారీ చేయనున్న పంచాయతీరాజ్‌ శాఖ  

సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): కొత్త రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నిక లు నిర్వహించేందుకు పంచాయతీరాజ్‌శాఖ సన్నాహాలు చేస్తోంది! కొత్తగా గ్రామ పంచాయతీలు ఆవిర్భవించడంతో పాత రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉందని సూత్రప్రాయంగా నిర్దేశించింది. సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసి పోవడంతో ప్రత్యే కాధికారులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో పాలన సాగుతోంది. అయితే, వచ్చే జనవరి రెండో వారంలోగా పంచాయతీలకు ఎన్నికలను పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేయడంతో పంచాయతీరాజ్‌ శాఖ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలు పెట్టిం ది.

పంచాయతీల ఎన్నికలను సకాలంలో నిర్వహించాలంటే మొదట రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని హైకోర్టు తీర్పు ఇవ్వడం, ఈ తీర్పును సుప్రీంకోర్టు ఇటీవలే ధ్రువీకరించింది. దీంతో పంచాయతీల రిజర్వేషన్లను ఖరారు చేయడానికి పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ఇం దులో భాగంగా ఈ నెల 15వ తేదీలోగా కులాల గణనను నిర్వహిం చి, కులాల వారీగా ఓటర్లను గుర్తించాల్సి ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సా మాజిక వర్గాల వారీగా ఓటర్ల గణన పూర్తి చేస్తే వాటి లెక్క ప్రకారం రిజర్వేషన్లను ప్రకటించనున్నారు.

50 శాతం మహిళలకే.. 

జిల్లాలో ఉన్న పంచాయతీల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అందులో 50 శాతం పంచాయతీలను మహిళలకు రిజర్వు చేయనున్నారు. ఆ తరువాత బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారీగా పంచాయతీలను రిజర్వు చేయడానికి చర్యలు చేపట్టనున్నారు. అయితే, కొత్తగా ఆవిర్భవించిన పంచాయతీల్లో ఎక్కువ శాతం గిరిజన తండాలు ఉండటంతో ఆ పంచాయతీలను ఎస్టీలకే రిజర్వు చేస్తారా లేక జనరల్‌ స్థానాలుగా పరిగణిస్తారో తేలాల్సి ఉంది. ఎస్టీల జనాభా ఎక్కువ ఉన్న పంచాయతీలను జనరల్‌ స్థానాల కింద పరిగణిస్తే ఓసీ, బీసీలు ఎక్కువ మంది ఉన్న చోట నష్టం కలిగే అవకాశం ఉంది. పంచాయతీరాజ్‌ శాఖ జారీ చేసే మార్గదర్శకాలతోనే రిజర్వేషన్లను ఏ విధంగా కేటాయిస్తారో వెల్లడవుతుంది.

పాత రిజర్వేషన్లు పోయినట్లే!

 కొత్త రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీల ఎన్నికలను నిర్వహించాలని పంచాయతీరాజ్‌ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించడంతో గతంలో ఏ విధమైన రిజర్వేషన్లు ఉన్నా వాటిని ఇప్పటి ఎన్నికల్లో పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. అంటే మునుపటి ఎన్నికల్లో ఒక పంచాయతీని బీసీ మహిళకు కేటాయిస్తే, ఈ సారి కూడా బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. అలాగే, బీసీ మహిళలకు కేటాయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే గతంలోని రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో లెక్కలోకి తీసుకోకుండానే కొత్త రిజర్వేషన్ల ప్రకారం ఏ పంచాయతీ ఏ సామాజిక వర్గానికి కేటాయించాలి, అలాగే మహిళలకా లేక జనరల్‌ అనేది నిర్ణయించాల్సి ఉంది.

అందువల్ల ఆశావహుల్లో కొంత మందికి సంతోషం కలుగుతుండగా, మరి కొందరికి నిరాశ కలిగిస్తోంది. సర్పంచ్‌ల స్థానాలే కాకుండా వార్డు సభ్యుల స్థానాలు సైతం రిజర్వేషన్ల ప్రకారం మార్పు చెందనున్నాయి. గతంలో కేటాయించిన రిజర్వేషన్‌ను మళ్లీ కేటాయించడమా లేక కొత్త విధానం ప్రకారం మరో విధంగా రిజర్వేషన్‌ కేటాయించడమా అనేది పంచాయతీ రాజ్‌ శాఖ జారీ చేయనున్న మార్గదర్శకాల ప్రకారం సాగనుంది.

 ఆశావహుల్లో ఉత్కంఠ.. 

సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టం పరీక్షించుకోవాలనుకునే ఆశావహుల్లో రిజర్వేషన్ల అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గతంలోని రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఏ సామాజిక వర్గానికి అవకాశం వస్తుందనే విషయం అంచనా వేయవచ్చు. అయితే, పంచాయతీల సంఖ్య పెరిగిన దృష్ట్యా కొత్త రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలను నిర్వహించాల్సి రావడంతో ఏ పంచాయతీ ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారో అంతు చిక్కకుండా ఉంది. తమకు పోటీ చేయడానికి అవకాశం వస్తుందా.. లేదా? అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే, కులాల వారీగా ఓటర్ల గణనకు ఎక్కువ సమ యం లేనందున పంచాయతీరాజ్‌ శాఖ త్వరగా రిజర్వేషన్లకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేస్తే ఉత్కంఠకు తెరపడే అవకాశముంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top