ఎంఎంటీఎస్‌ రైళ్లకు కొత్త లుక్‌ 

New look to the MMTS trains - Sakshi

ఇప్పటికే నగరానికి చేరిన బోగీలు 

పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం  

సాక్షి, హైదరాబాద్‌: దశాబ్దన్నర కాలంగా నగర రవాణాలో భాగమైన ఎంఎంటీఎస్‌ రైలు బోగీలు కొత్త రంగులతో మెరిసిపోనున్నాయి. ఎంఎంటీఎస్‌ రైళ్ల లుక్‌ను మార్చాలని రైల్వే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ప్రయోగాత్మకంగా కొత్త లుక్‌తో కొన్ని బోగీలు రూపొందించి నగరానికి చేర్చింది. ప్రస్తుతం మౌలాలిలోని ఈఎంయూ కార్‌షెడ్‌లో ఉన్న కొత్త ఎంఎంటీఎస్‌ రేక్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా బుధవారం పరిశీలించారు. ఇప్పటి వరకు తెలుపు రంగుపై నీలి రంగు స్ట్రిప్‌తో బోగీలు నడుస్తున్నాయి. మధ్యలో మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బోగీలకు గులాబీ రంగు వేయించారు. ఇప్పుడు రైలు బోగీలకు కొత్త రంగులు రానున్నాయి. ప్రస్తుతం గులాబీ రంగు డిజైన్లతో ఉన్న బోగీలు వచ్చాయి. వాటిల్లో సీట్ల రూపాన్ని కూడా మార్చారు. సీటింగ్‌ సామర్థ్యాన్ని కూడా పెంచారు. ఈ కొత్త రైళ్లు త్రీ ఫేజ్‌ విద్యుత్‌తో నడుస్తాయి. వీటిల్లో కొన్ని ఆధునిక వసతులు కూడా కల్పించనున్నారు. తమిళనాడులోని పెరంబుదూర్‌ ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో వీటిని రూపొందిస్తున్నారు. వీటిని పరిశీలించిన అనంతరం.. అధికారులు చేసే సూచనల ఆధారంగా మార్పుచేర్పులు చేసి పూర్తిస్థాయి కొత్త బోగీలను సరఫరా చేయనున్నారు.  

పనుల పురోగతిపై జీఎం సమీక్ష.. 
అల్వాల్‌ రైల్వే స్టేషన్‌లో కొనసాగుతున్న ఎంఎంటీఎస్‌ ఫేజ్‌–2 పనుల పురోగతిపై గజానన్‌ మాల్యా సమీక్షించారు. మౌలాలిలోని ఎలక్ట్రిక్‌ కార్‌షెడ్‌లో ఎలక్ట్రికల్‌ మల్టిపుల్‌ యూనిట్‌ (ఈఎంయూ) కోచ్‌ నిర్వహణ అవసరాలను గురించి సమగ్ర సమీక్ష జరిపారు. ఎంఎంటీఎస్‌ రేక్‌ మరమ్మతులు నిర్వహించే పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ షెడ్‌ను పరీక్షించారు. అనంతరం స్టేషన్‌ అభివృద్ధి కార్యక్రమాలపై డీఆర్‌ఎంతో చర్చించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top