ఎస్‌ఐ ఎక్కడికెళ్లాడు ?

Neredmet Sub Inspector Naga Raju Missing - Sakshi

 అధికారిక ఫోన్‌ స్విచ్ఛాఫ్‌

మూడు రోజులుగా లభించని ఆచూకీ  

పోలీసుశాఖలో కలకలం

కారణం అధికారుల వేధింపులా?..పనిభారమా!

సాక్షి హైదరాబాద్‌‌: రాచకొండ పోలీసు కమిషనరేట్‌ మల్కాజిగిరి జోన్‌ పరిధిలోని నేరేడ్‌మెట్‌ ఎస్‌ఐ నాగరాజు ఏమయ్యాడో అంతుపట్టడం లేదు.  ఆయన కనిపించకుండాపోయి దాదాపు మూడు రోజులవుతున్నా ఆచూకీ లభించడంలేదు. క్రైం మీటింగ్‌ మధ్యలోనే అర్థాంతరంగా వెళ్లిపోయిన ఎస్‌ఐ తరువాత నుంచి ఠాణాకు అందుబాటులో లేకపోవడం పోలీసు శాఖలో కలకలం రేగింది. కొందరు పైఅధికారుల వేధింపులే వల్లనే  ఎస్‌ఐ అందుబాటులో లేకుండా పోయారని  ప్రచారం జోరుగా సాగుతోంది.  పని భారం కూడా మరో కారణమనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది.

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పుల్లం నాగరాజు మొదటి పోస్టింగ్‌గా ఏడాదిన్నర క్రితం నేరేడ్‌మెట్‌ ఠాణాలో ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించారు. విధి నిర్వహణలో చురుకుగా వ్యవహారిస్తాడని ఆయనకు పేరుంది. ఇటీవల ఆయనపై పనిభారం పెరిగినట్టు తెలుస్తోంది. కొన్ని వ్యవహారాలను చక్కదిద్దాలని, అందుకు అంగీకరించకపోవడంతో ఓ అధికారి తరుచూ ఎస్‌ఐని వేధింపులకు గురి చేసేవాడని తెలిసింది. దాంతో కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే సాకుతో ఎస్‌ఐ పనితీరును సదరు అధికారి తప్పుబట్టేవాడని తెలుస్తోంది. ఈ వేధింపులు తీవ్రమవుతున్న నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం ఎస్‌ఐకి బాలాపూర్‌కు బదిలీ అయ్యాడని పోలీసు వర్గాల్లో ప్రచారం ఉంది. బాలాపూర్‌కు వెళ్లడం ఎస్‌ఐకి ఆసక్తి లేదని, అందుకే ఇలా చేసిఉండొచ్చని ప్రచారం జరుగుతుంది.

ఈక్రమంలోనే ఈనెల 22వతేదీన జవహర్‌నగర్‌లో సీఐ,ఎస్‌ఐలతో ఏసీపీ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం సుమారు 10గంటలకు ఈ సమావేశానికి హాజరైన ఎస్‌ఐ నాగరాజు తనకు ఒంట్లో బాగాలేదని చెప్పి మధ్యలోనే వెళ్లిపోయాడు. మరో ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి ద్విచక్రవాహనం తీసుకొని ఉప్పల్‌ పరిధిలోని చిలుకానగర్‌లో తన ఇంటికి వెళ్లినట్టు,అక్కడి నుంచి ఎస్‌ఐ నాగరాజు అందుబాటులో లేకుండా పోయారు. అధికారిక సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌లో ఉంది. మొత్తమ్మీద అధికారుల వేధింపులు, పనిభారం కారణం ఏదైనా ఎస్‌ఐ అదికారులకు అందుబాటులో లేకపోవడం పోలీసు వర్గాలను కలవరపరుస్తోంది. ఎస్‌ఐ కోసం పోలీసులు ఆరాతీస్తున్నట్లు తెలుస్తుంది.   

ఆరోపణల్లో నిజం లేదు..
ఎస్‌ఐ నాగరాజు అదుబాటులో లేకపోవడం  విషయంలో వేధింపులకు గురిచేసినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నేరేడ్‌మెట్‌ సీఐ జగదీశ్‌ చందర్‌ ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. గురువారం ఎస్‌ఐల సమావేశం నుంచి ఎలాంటి సమాచారం లేకుండా నాగరాజు వెళ్లిపోయాడని, అప్పటినుండి ఆయన అందుబాటులో లేరని సిఐ చెప్పారు. ఎస్‌ఐ కోసం సమాచారం సేకరిస్తున్నామని సీఐ తెలిపారు.  

వ్యక్తిగత పనులమీద ఊరికి వెళ్లారు..
ఎస్‌ఐ నాగరాజు వ్యక్తిగత పనులమీద ఊరికి వెళ్లినట్లు ఎస్‌ఐ మామ అనంతయ్య సాక్షికి ఫోన్‌లో వివరణ ఇచ్చారు. ఎస్‌ఐ మిస్సింగ్‌ అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top