నాడు సామాన్యులు.. నేడు అసామాన్యులు

National Police Academy Director Abhay Praises 2017 IPS Batch - Sakshi

శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ ట్రైనీలు

సాక్షి, హైదరాబాద్‌ : ‘రెండేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న 2017 ఐపీఎస్‌ బ్యాచ్‌కు ఎంపికైన వారంతా సామాన్యులే. వారి పట్టుదలే వారిని ఈ రోజు అసామాన్యులుగా సమాజానికి పరిచయం చేస్తోంది’ అని నేషనల్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ అభయ్‌ అన్నారు. 24వ తేదీన ఐపీఎస్‌ 2017 బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం బ్యాచ్‌ క్యాడెట్లను మీడియాకు పరిచయం చేశారు. ఈ బ్యాచ్‌లో ఎంపికైన వారంతా సామాన్య కుటుంబాలవారేనని, మారుమూల పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చిన వారేనని వెల్లడించారు. వీరంతా ఇప్పుడు సమాజసేవకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. మొత్తం 92 మందిలో 80 మంది పురుషులు, 12 మంది మహిళలు. అందులో ఆరుగురు రాయల్‌ భూటాన్‌ పోలీసు, ఐదుగురు నేపాల్‌ పోలీస్‌ విభాగానికి చెందిన విదేశీయులున్నారు.

ట్రైనీలంతా చాలా కష్టపడి శిక్షణ పూర్తి చేశారని వివరించారు. వీరందరికీ కఠోర శిక్షణ ఇచ్చామని, 40 కి.మీ.ల దూరం మేర 10 కేజీల భారాన్ని మోస్తూ ఎండలో ఆగకుండా పరుగులు పెట్టించామన్నారు. దేశంలోని అత్యున్నత దర్యాప్తు, నిఘా సంస్థలతోనూ వీరికి దశలవారీగా శిక్షణ ఇచ్చామని వివరించారు. ఢిల్లీకి చెందిన గౌస్‌ ఆలం, యూపీకి చెందిన రిచా తోమర్, బెంగాల్‌కు చెందిన పలాష్‌ చంద్ర, నేపాల్‌కు చెందిన క్రిష్ణ కడ్కా, అను లామాలు ఈ బ్యాచ్‌లో వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచారని తెలిపారు. తెలంగాణకు ముగ్గురు, ఏపీకి ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను కేటాయించారు.  24వ తేదీన దీక్షంత్‌ పరేడ్‌ పేరిట జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు..
తెలంగాణకు చెందిన గరికపాటి బిందు మాధవ్, వాసన విద్యాసాగర్‌ నాయుడు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తుహిన్‌ సిన్హా ఏపీ కేడర్‌కు ఎంపికయ్యారు. ఢిల్లీకి చెందిన గౌస్‌ ఆలం, కర్ణాటకకు చెందిన డాక్టర్‌ వినీత్, డాక్టర్‌ శబరీశ్‌లను తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. తెలంగాణకు చెందిన బీబీజీటీఎస్‌ మూర్తిని యూపీకి కేటాయించారు. ఏపీకి చెందిన కేవీ అశోక్‌ను యూపీ, బోగాటి జగదీశ్వర్‌రెడ్డిని త్రిపుర, మల్లాది కార్తీక్‌ని మణిపూర్‌ కేడర్‌కు కేటాయించారు.  

ఇంజనీర్లు, డాక్టర్లదే పైచేయి..
ఈసారి బ్యాచ్‌లో విద్యార్హతల పరంగా ఇంజనీర్లు, డాక్టర్లదే పైచేయిగా నిలిచింది. మొత్తం 92 మంది ఐపీఎస్‌ అధికారుల విద్యా నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ఆర్ట్స్‌–7, సైన్స్‌–5, కామర్స్‌–02, ఇంజనీరింగ్‌–57, మెడిసిన్‌–11, ఎంబీఏ–7, ఇతరులు–3 మంది ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top