మాకు ప్రజలే హైకమాండ్‌ | Narsapur to get new RTC depot soon | Sakshi
Sakshi News home page

మాకు ప్రజలే హైకమాండ్‌

Jul 27 2018 1:46 AM | Updated on Mar 18 2019 9:02 PM

Narsapur to get new RTC depot soon - Sakshi

నర్సాపూర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

నర్సాపూర్‌:  కాంగ్రెస్‌ పార్టీకి ఢిల్లీలో హైకమాండ్‌ ఉంటుందని, వారు ఏది చేయాలన్న ఢిల్లీ నుంచి అనుమతులు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గురువారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఆర్టీసీ డిపో నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలసి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తమకు కాంగ్రెస్‌లాగా కాకుండా రాష్ట్ర ప్రజలే హైకమాండ్‌ అని, తమ ఆత్మ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంటుందని అన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో కరెంటుకు కొరత, విత్తనాలకు కొరత, ఎరువుల కొరత, సాగు, తాగునీటి కొరత ఉండేదని.. విత్తనాలు కావాలంటే పోలీస్‌ స్టేషన్‌లో క్యూలో నిల్చొని, కొనాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. రైతులు పండించిన ఏ పంటకూ మద్దతు ధర లభించేది కాదని దీంతో రైతులు నష్టపోయేవారని అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌ ఓట్ల కోసం కాకుండా ప్రజల కష్టాలు గుర్తించి వాటిని పరిష్కరించడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటు పడుతున్నారన్నారు.

అలాగే 24 గంటల కరెంటు సరఫరా, రైతులకు కావాల్సినన్ని ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయ న్నారు. సాగు నీరు అందచేస్తున్నామని, తాగు నీరు అందజేసేందుకు భగీరథ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రైతులను ఆదుకోవడానికి రైతుబంధు పథకం కింద ఎకరానికి ఒక పంటకు రూ.నాలుగు వేలు ఇవ్వాలని నిర్ణయించి రాష్ట్రంలోని రైతులకు రూ.12 వేల కోట్లు పెట్టుబడి సాయంగా అందజేశారన్నారు.  

నాలుగేళ్లలో రూ.వెయ్యి కోట్లు: మహేందర్‌రెడ్డి
రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవడానికి సీఎం కేసీఆర్, రాష్ట్ర బడ్జెట్‌లో నాలుగేళ్లలో వెయ్యికోట్లు కేటాయించారని అన్నారు. ఆర్టీసీని పటిష్టం చేసేందుకు 230 కొత్త బస్సులు కొనుగోలు చేస్తామని, సిబ్బంది జీతాలు పెంచనున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

టీఆర్‌ఎస్‌ ఉన్నంత కాలం ‘రైతుబంధు’
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీఆర్‌ఎస్‌ పార్టీ ఉన్నంత కాలం, సీఎంగా కేసీఆర్‌ కొనసాగినంత కాలం ‘రైతుబంధు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డిఖానాపూర్, చందాపూర్‌లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్, ఆగస్టు 15 నుంచి ‘రైతు బీమా’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.  ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి మురళీయాదవ్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement