కండల వీరులొస్తున్నారు..! | Sakshi
Sakshi News home page

కండల వీరులొస్తున్నారు..!

Published Fri, Jan 11 2019 9:29 AM

Naresh Surya Classic Fitness Expo in Shamshabad - Sakshi

ఆ కండలు కొండలను తలపిస్తాయి. బాప్‌రే.. ఎలా పెంచారంటూ ఒకింత ఆశ్చర్య చకితులను చేస్తాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందలాది మంది బాడీ బిల్డర్లు తమ కండలను ప్రదర్శించే వేదిక సిద్ధమైంది. సౌతిండియాలోనే తొలిసారిగా ‘నరేష్‌ సూర్య క్లాసిక్‌ ఫిట్‌నెస్‌ ఎక్స్‌పో– 2019 పేరుతో నిర్వహించనున్న ఈ పోటీలు శంషాబాద్‌లో జరగనున్నాయి. మన దేశంతోపాటు దుబాయి, హాంకాంగ్, ఖతార్‌ వంటి పలు దేశాలకు చెందిన బాడీబిల్డర్లు ఇందులో పాల్గొని తమ విన్యాసాలతో కనువిందు చేయనున్నారు.   

హిమాయత్‌నగర్‌ :బంజారాహిల్స్‌కు చెందిన నరేష్‌ సూర్య సిటీలోని ఎంతోమంది ప్రముఖులకు పర్సనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా సేవలు అందిస్తున్నారు. నగరవాసుల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించేందుకు, తెలంగాణలోని బాడీ బిల్డర్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ‘నరేష్‌ సూర్య క్లాసిక్‌ ఫిట్‌నెస్‌ ఎక్స్‌పో’ పేరుతో 2016లో ఎక్స్‌పోను ప్రారంభించారు. ఈ ఏడాది శంషాబాద్‌ సతంరియాలోని రాజ్‌మహాల్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఎక్స్‌పోను తన స్నేహితుడు జయసింహగౌడ్‌తో కలిసి ఆయన నిర్వహించనున్నారు. 

కేటగిరీలివే.. 
‘మెన్స్‌ బాడీ బిల్డింగ్, మెన్స్‌ క్లాసిక్‌ బాడీ బిల్డింగ్, మెన్స్‌ ఫిజిక్, మేల్‌ ఫిట్‌నెస్‌ మోడల్, మాస్టర్స్‌ బాడీ బిల్డింగ్, ఫిజికల్లీ హ్యాండీక్యాప్‌డ్‌ బాడీ బిల్డింగ్, ఉమెన్స్‌ బికినీ, ఉమెన్స్‌ ఫిగర్, జూనియర్‌ బాడీ బిల్డింగ్, జూనియర్‌ మెన్స్‌ ఫిజిక్‌ (23సంవత్సరాల కంటే తక్కువ వయసు వారికి)’ విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నారు. వీటిలో ప్రధానంగా ‘పవర్‌ లిఫ్టింగ్, స్ట్రెంత్‌ లిఫ్టింగ్, ఆర్మ్‌ రెజ్లింగ్, క్రాస్‌ఫిట్‌ ఛాలెంజ్‌’లతో పాటు ‘మౌతాయి, ఎంఎంఏ, కిక్‌బాక్సింగ్‌’ వంటి వాటిని జత చేర్చారు. ఈ ఎక్స్‌పో సౌతిండియాలోనే తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు నరేష్‌ సూర్య తెలిపారు. బాడీ బిల్డింగ్‌ పోటీలను మొత్తం ఐదు కేటగిరీల్లో నిర్వహించనున్నారు. అండర్‌– 60, అండర్‌– 70, అండర్‌70– 80, అండర్‌– 80–90, అండర్‌– 90 ప్లస్‌ కేజీల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఐదు కేటగిరీల్లో చాంపియన్‌గా నిలిచిన వారికి ‘నరేష్‌ సూర్య క్లాసిక్‌ పిట్‌నెస్‌– 2019’ పేరుతో రూ.లక్ష నగదు బహుమతినిఇవ్వనున్నారు. 

అలరించనున్న అంతర్జాతీయ బిల్డర్లు 
మూడు రోజుల పాటు జరిగే ఎక్స్‌పోలో జాతీయ, అంతర్జాతీయ బాడీ బిల్డర్లు కనువిందు చేయనున్నారు. ఈ నెల 20న ‘ఇంటర్నేషనల్‌ మెన్స్‌ ఫిజిక్‌ అథ్లెట్‌ సిద్ధాంత్‌ జైస్వాల్, అర్నాల్‌ క్లాసిక్‌ విజేత, మిస్టర్‌ ఏషియన్‌ అంకుర్‌ శర్మ, బెంగళూరుకు చెందిన ఫిట్‌ కపూల్‌ పూజ, గౌరవ్, ఉమెన్స్‌ ఫిగర్‌ సోనాలీస్వామి, బాడీబిల్డర్‌ పుణిత్‌ సాందూ, నిపున్‌ అగర్వాల్, ప్రీతం చౌగ్లీ, రోహిత్‌రాజ్‌పుత్‌’లు డెమో ఇవ్వనున్నారు. 

గుర్తింపు, అవగాహన కోసం..

రాష్ట్రంలోని బాడీ బిల్డర్లకు గుర్తింపు తేవడంతో పాటు ప్రజల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచాలనే ఈ ఎక్స్‌పోను ఏటా నిర్వహిస్తున్నాం. ఈసారి పోటీలు సౌతిండియాలోనే ఎక్కడా జరగని విధంగా తలపెట్టాం. ప్రభుత్వం సాయం అందిస్తే ఈ పోటీలకు మరింత ఆదరణ లభిస్తుంది.   – నరేష్‌ సూర్య,ఆర్గనైజర్‌

రోజుకు రూ.100
మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే ఈవెంట్స్‌ ప్రవేశ రుసుం ఒక్కరోజుకు రూ.100.టికెట్లను బుక్‌మై షో లేదా నేరుగా తీసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 86866 52655/77022 72803 

Advertisement
 
Advertisement
 
Advertisement