ఎన్నికల కోడ్‌ కఠినంగా అమలు

Nagi Reddy Says Strictly Conduct Election Code In Telangana - Sakshi

పట్టణ ఓటింగ్‌ పెరిగేలాచైతన్య పరచాలి

కలెక్టర్లకు స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ నాగిరెడ్డి ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: పురపాలక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమా వళి అమల్లో కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లను, ఎన్నికల ఇన్‌చార్జ్‌లను స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ వి.నాగిరెడ్డి ఆదేశించారు. ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల కోడ్‌ను కచ్చి తంగా పాటించాలని, అధికార పార్టీతోసహా ఎవ రూ ఎక్కడా కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువగా ఓటింగ్‌కు రావడం లేదని, మున్సిపల్‌ ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు ముందు అభ్యర్థుల వివరాలు సరిగా చూసుకోవాలని, అలాగే, అభ్యర్థులకు ఎన్నికల గుర్తు కేటాయించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

సోమవారం మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లు, అధికారుల సంసిద్ధతపై ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల ఇన్‌చార్జ్‌లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నాగిరెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాలు ఇంకా సిద్ధం చేయని మునిసిపల్‌ కమిషనర్లు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. పోలింగ్‌ విధులు నిర్వర్తించే ఎన్నికల సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, పోలింగ్‌ రోజు ప్రజల చేతి వేలిపై సిరా గుర్తు వేసేటప్పుడు నిశితంగా పరిశీలించాలని నాగిరెడ్డి సూచించారు. కమిషన్‌ ప్రకటించిన గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డును చూసిన తర్వాతే ఓటింగ్‌కు అనుమతించాలన్నారు. మున్సిపల్‌శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి, ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top