
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అక్కడ ఉన్న ఒకే టాయిలెట్‌తో ఇక్కట్లు పడుతున్న అంశం ప్రజాప్రతినిధులను కదిలించింది. ఈ ఇబ్బందిపై ‘చెప్పుకోలేని బాధ’శీర్షికతో శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి వారు చలించారు. రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందిస్తూ విద్యార్థినులు టాయిలెట్ కోసం చాంతాడంత క్యూలైన్ పాటించాల్సిన దుస్థితి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తక్షణ చర్యల్లో భాగంగా తన ఎంపీ నిధుల నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులను విడుదల చేస్తానని ప్రకటిస్తూ ‘సాక్షి’కథనాన్ని ట్వీట్ చేశారు. టాయిలెట్ల నిర్మాణానికి తాను బాధ్యత తీసుకుని పూర్తి చేయిస్తానని, ఈ మేరకు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్లరామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఆ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.1.75లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఏటీఆర్ కోరిన కేంద్రమంత్రి..
టాయిలెట్ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందించారు. సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) తనకు సమర్పించాలని సూచించారు.
అన్ని స్కూళ్లలో అవసరమైనన్ని టాయిలెట్లు : మంత్రి సబితారెడ్డి
గూడూరు పాఠశాలలోని టాయిలెట్ల సమస్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆ జిల్లా కలెక్టర్‌తో ఫోనులో మాట్లాడారు. పాఠశాలలో అదనంగా మరికొన్ని మరుగుదొడ్లు నిర్మించి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గా మరుగుదొడ్లను నిర్మించాలని, ఈమేరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.మరోవైపు శనివారం ఆ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బృందం సందర్శించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది.
వాళ్లది చెప్పుకోలేని బాధ...
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్నా...ఆచరణలో కనిపించడం లేదు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా గూడూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 130మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అయితే వీరందరికీ ఒకే టాయ్‌లెట్ (మూత్రశాల) ఉంది. అలాగే ప్రాథమిక పాఠశాలలో 80మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఉపాధ్యాయులకు కలుపుకుని ఇక్కడ కూడా ఒకే టాయ్‌లెట్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లోనూ చాంతాడంత క్యూ కట్టాల్సిందే. ఏళ్ల తరబడి ఈ దుస్థితి ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు టాయ్‌లెట్‌ల నిర్మాణానికి నిధుల మంజూరుకు ముందుకు వచ్చారు.
Sad to see this. Sufficient funds will be sanctioned from MPLAD Scheme to address this issue immediately . @SakshiNewsPaper@TNewstg @trspartyonline pic.twitter.com/zDMp0AuW3A
— Santosh Kumar J (@MPsantoshtrs) October 26, 2019