
గూడూరు నుంచి చిత్తూరు మీదుగా తమిళనాడుకు అక్రమ రవాణా
నంబర్ ప్లేట్లు మార్చి రోజూ 20 లారీల్లో యథేచ్ఛగా తరలింపు
నెల్లూరు, తిరుపతి టీడీపీ నేతల కనుసన్నల్లో దందా
కళ్లు మూసుకున్న మైనింగ్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం
సాక్షి టాస్క్ ఫోర్స్ : చిత్తూరు జిల్లా పాలంతోపు వద్ద శనివారం ఓ లారీ రోడ్డు పక్కకు వాలిపోయి ఇరుక్కుపోయింది. అక్కడకు వెళ్లిన స్థానికులు ఆ వాహనం నుంచి ఇసుక రాలుతుండటంతో మీడియా, పోలీసులకు సమాచారం అందించారు. పొక్లెయిన్ రాకపోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు లారీ అక్కడే నిలిచిపోయింది. అదే ప్రాంతానికి పది అడుగుల దూరంలో.. ఐదు రోజుల క్రితం గూడూరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ లారీ కూరుకుపోవడంతో రాత్రికి రాత్రే జేసీబీ రప్పించి గుట్టుగా తరలించారు.
» చిత్తూరు మండలం అనంతాపురం గ్రావిటా ఫ్యాక్టరీ వద్ద గురువారం ఓ లారీ టైర్ పేలడంతో నిలిచిపోయింది. ఆగిన లారీ నుంచి ఇసుక, నీళ్లు కారడంతో అనుమానించిన స్థానికులు టార్పాలిన్ తొలగించి పరిశీలించగా వరి పొట్టు గోతాల కింద దాచిన ఇసుక బయటపడింది.
» వరిపొట్టు చాటున ఇసుక దందా జోరుగా సాగుతోంది. తిరుపతి జిల్లా గూడూరు నుంచి చిత్తూరు మీదుగా తమిళనాడుకు యథేచ్ఛగా తరలిపోతోంది. రోజూ దాదాపు 20 లారీల్లో సరిహద్దులు దాటుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. నెల్లూరు, తిరుపతికి చెందిన టీడీపీ నేతల కనుసన్నల్లో పుష్ప సినిమా తరహాలో లారీల నంబర్ ప్లేట్లు మార్చి తప్పుడు పత్రాలతో అక్రమ ఇసుకను చేరవేస్తున్నారు.
గూడూరులో డంప్..
తిరుపతి జిల్లా గూడూరు వద్ద స్వర్ణముఖి నది, నెల్లూరులోని పెన్నానది కేంద్రంగా ఇసుక దందా నడుస్తోంది. పొక్లెయిన్లతో తోడేసిన ఇసుకను గూడూరులోని నిర్మానుష్య ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. అనంతరం లారీల్లో ఇసుక నింపి పైన వరి పొట్టు గోతాలను అమర్చి అనుమానం రాకుండా టార్పాలిన్ పట్టాలు కడుతున్నారు. ఇలా విలువైన ఇసుక తమిళనాడులోని చెన్నై దాకా అక్రమంగా తరలిపోతోంది.
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం, చిత్తూరు మండలం తిరుత్తణి రోడ్డు, జీడీ నెల్లూరులోని తూగుండ్రం రోడ్డు మీదుగా రోజూ 20 లారీల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ఒక్కో లారీ ఇసుకను రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల దాకా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన వ్యక్తులతో చేతులు కలిపి ఈ దందా సాగిస్తున్నారు.
దారి తప్పిన నిఘా...
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక దందాకు హద్దులు చెరిగిపోయాయి. నదులు, కాలువలు, వాగులు వంకలను కొల్లగొట్టేస్తున్నారు. తమిళనాడుతోపాటు కర్ణాటకకు సైతం లారీల్లో టన్నులు టన్నులు తరలిపోతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకుని కూర్చున్నారు.
పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో రెండు జిల్లాల్లో యథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతోంది. ఒకవేళ స్థానికుల ఫిర్యాదుతో తప్పనిసరై పట్టుకున్నా నామమాత్రంగా జరిమానా విధించి వదిలేయాలనే ఒప్పందంతో ఇసుక దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది.