ఒకే కాన్పులో నలుగురు శిశువులు | Mother gives birth four babies at Gandhi hospital | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో నలుగురు శిశువులు

Nov 27 2014 6:19 AM | Updated on Oct 5 2018 6:29 PM

ఒకే కాన్పులో ఓ మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది.

హైదరాబాద్: ఒకే కాన్పులో ఓ మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే గర్భంలోనే ఓ శిశువు మృతిచెందటంలో వైద్యులు శస్త్రచికిత్స చేసి మృతశిశువుతోపాటు ఇద్దరు మగ, ఒక ఆడ శిశువును తల్లి గర్భం నుంచి బయటకు తీశారు. ఈ ఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని ఆరూరు గ్రామానికి చెందిన లక్ష్మికి రెండేళ్ల కిందట సీహెచ్.రాజన్నతో వివాహమైంది. కొన్ని నెలల కిందట గర్భందాల్చిన లక్ష్మి వైద్యపరీక్షల కోసం స్థానిక డాక్టర్లను సంప్రదించగా వారి సూచన మేరకు ఈ ఏడాది జూన్‌లో గాంధీ ఆస్పత్రిలో చేరింది. గైనకాలజీ విభాగ వైద్యులు లక్ష్మికి పరీక్షలు నిర్వహించి ఆమెకు ఒకే గర్భసంచిలో నాలుగు అండాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. ఏడు నెలలు నిండిన తర్వాత గర్భంలోని ఓ శిశువు మృతి చెందినట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు. అప్పుడే శస్త్రచికిత్స నిర్వహిస్తే మిగిలిన శిశువులు మృతి చెందే అవకాశం ఉందని భావించి ఆస్పత్రిలోనే వైద్యసేవలు అందించారు. కడుపులోని మిగిలిన శిశువులతోపాటు తల్లికి ఎటువంటి ప్రమాదం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
 
 నెలల నిండిన తర్వాత బుధవారం ఉదయం సుమారు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి మృతశిశువుతోపాటు, ముగ్గురు శిశువులను బయటకు తీశారు. ప్రస్తుతం నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్‌ఎన్‌సీయు)లో శిశువులకు వైద్యసేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్సకు నేతృత్వం వహించిన గాంధీ గైనకాలజీ ప్రొఫెసర్ అనుపమ మీడియాతో మాట్లాడుతూ... ఒకే గర్భసంచిలో నలుగురు పిల్లలు ప్రాణం పోసుకోవడం అరుదైన విషయమన్నారు. గర్భంలోనే శిశువు మృతిచెందినా మిగిలిన శిశువుల ప్రాణాలు కాపాడేందుకు ఎంతగానో శ్రమించామన్నారు. నెలలు నిండేంత వరకు ఆగి తల్లీబిడ్డలకు ప్రాణాపాయం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కాగా, ఈ శస్త్రచికిత్స నిర్వహించిన ప్రొఫెసర్ అనుపమ, వైద్యులు లక్ష్మీప్రసన్న,సుమలత, సాధన, సరిత, భీమేష్‌కుమార్‌లతో పాటు సిబ్బందిని ఆస్పత్రి సూపరింటెండెంట్ ధైర్యవాన్ అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement