దసరాకు అదనపు బస్సులు

More Buses On Dasara Festival - Sakshi

స్పెషల్‌ సర్వీసులకు 50 శాతం అదనంగా చార్జీలు

సాక్షి, హైదరాబాద్‌: దసరా పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులను నడుపుతామని టీఎస్‌ ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ యాదగిరి తెలిపారు. ఎంజీబీఎస్‌లో విలేకరుల సమావేశంలో యాదగిరి మాట్లాడారు. తెలంగాణాతో  పాటు ఆంధ్రా, ముంబాయి, బెంగుళూరు, చెన్నై, పూణె ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 9 నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతున్న సందర్భంగా 8వ తేదీ సాయంత్రం నుంచే రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతామని వెల్లడించారు. 13,14 తేదీలతో పాటు 19న కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నడిపేందుకు సిద్ధం చేశామని తెలిపారు.

పండుగ సందర్భంగా 4480 బస్సులను అదనంగా తిప్పుతున్నామని చెప్పారు. తెలంగాణ జిల్లాలకు ఎక్కువ సర్వీసులు నడుపుతామని అన్నారు. ఓపీఆర్‌ఎస్‌ ఆధారంగా అదనపు బస్సులను ఇంటర్‌స్టేట్‌లకు నడుపుతామని తెలిపారు. ప్రయాణికులు రిజర్వేషన్‌ చేసుకుని ప్రయాణాలు ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు. రద్దీ తగ్గించేందుకు నగర శివార్ల నుండి సర్వీసులను నడిపిస్తామని వెల్లడించారు. వరంగల్‌, యాదగిరిగుట్ట నుంచి వచ్చే బస్సులు ఉప్పల్‌ వరకే నడుస్తాయని, ఉత్తర తెలంగాణ సర్వీసులను జేబీఎస్‌కే పరిమితం చేస్తామని తెలిపారు. రాయలసీమకు సీబీఎస్‌ హ్యాంగర్‌ నుంచి నడిపే వాళ్లం కానీ అది పడిపోయినందుకు ఎంజీబీఎస్‌ నుంచి ఆపరేట్‌ చేస్తామని అన్నారు. కాచీగూడ బస్టాండ్‌ నుంచి స్పెషల్‌ బస్‌లను నంద్యాల, కడప, చిత్తూరు, నందికొట్కూరు ప్రాంతాలకు నడుపుతామని చెప్పారు.

నల్గొండ జిల్లా బస్సులను దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి, విజయవాడ రూట్‌ బస్సులు కూడా ఎంజీబీఎస్‌ నుంచి కాకుండా నగర శివార్ల నుంచి, కొన్ని ఆంధ్రా ప్రాంత సర్వీసులు ఎల్బీనగర్‌ నుంచి, తిరుపతికి ఎంజీబీఎస్‌ నుంచి నడుపుతామని వెల్లడించారు. 16,17, 18 తేదీల్లో ఎంజీబీఎస్‌ నుంచి సిటీ బస్సులను నగర శివార్లకు నడుపుతామని వివరించారు. సమాచారం లేక ఎంజీబీఎస్‌కు వచ్చేవారు ఈ బస్సులను వినియోగించుకోవాలని సూచించారు. బెంగుళూరు నుంచి వచ్చివెళ్లే వారికోసం 90 బస్సులు అదనంగా సిద్ధం చేశామని.. టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. స్పెషల్‌ సర్వీసులకు 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేస్తామని తెలిపారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top