ఎన్నికల కోసమే చెక్కుల పంపిణీ 

MLA DK Aruna Comment On Rythu Bandhu Programme - Sakshi

గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ 

సాక్షి, గద్వాల : భూమి సర్వే చేయకుండానే భూ రికార్డులు సరిచేశారని.. ఇప్పటికీ భూ రికార్డులు తప్పులతడకగా ఉన్నాయని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. గురువారం డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుబంధు పథకంలో నియోజకవర్గంలోని 30 శాతం మంది రైతులకు చెక్కులు,  పాస్‌పుస్తకాలు అందలేదని, వాస్తవంగా ఉన్న భూమికి రికార్డుల్లో ఉన్న భూ వివరాలకు పొంతనలేని పరిస్థితి ఉందన్నారు. ఒక్కో మండలంలో వేల ఎకరాల్లో భూమి ఉన్నదాని కంటే రికార్డులు ఎక్కువగా ఉన్నట్లు చూయిస్తోందని రెవెన్యూ అధికారులే చెబుతున్నారని, చాలా గ్రామాల్లో తప్పులు తడకగా రికార్డులు ఉన్నాయని, చెక్కులు లేకున్నా లక్షలు విలువ చేసే భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు భయపడుతున్నారని తెలిపారు.

చెక్కులు, పాస్‌పుస్తకాలు అందలేదని గ్రామ పంచాయతీ ఎన్నికల లోపే ఆ సమస్యలను పరిష్కరించి అందరికి పాస్‌పుస్తకాలు, చెక్కులు అందజేయాలని డిమాండ్‌ చేశారు. రాబోయే సర్పంచు ఎన్నికల్లో గెలుపొందాలనే ఉద్ధేశ్యంతోనే ప్రభుత్వం రూ. 4వేల చెక్కులను ఇస్తుందని ఆరోపించారు. నాలుగేళ్లుగా రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, లక్ష రుణమాఫీకి నాలుగేళ్ల సమయం తీసుకున్నారన్నారు. దేశంలోనే ఎక్కువశాతం రైతులు తెలంగాణ రాష్ట్రంలోనే ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నాలుగేళ్లుగా నెట్టెంపాడు కాలువలను కూడా పూర్తి చేయలేక పోయారని విమర్శించారు. 

గట్టు ఎత్తిపోతల పథకం ఇంకా డీపీఆర్‌ దశలోనే ఉందని, గద్వాలలోని ఈద్గాకు రూ.2కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని, డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నట్లు ఈద్గా కమిటీ ద్వారా తెలిసిందని, ప్రొటోకాల్‌ ప్రకారం ఎమ్మెల్యేకు తెలియజేయాల్సి ఉన్నా ఇప్పటి అధికారికంగా తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, డీటీడీసీ నర్సిములు, సుదర్శన్, ఇతర నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top