'తెలంగాణ రావడంవల్లే పోచంపాడు'
తెలంగాణ వచ్చింది కాబట్టే పోచంపాడు ప్రాజెక్టు వచ్చిందని నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
పోచంపాడు: తెలంగాణ వచ్చింది కాబట్టే పోచంపాడు ప్రాజెక్టు వచ్చిందని నీటి పారుదలశాఖమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పునరుజ్జీవ ప్రాజెక్టు కర్త, క్రియ, రూపకర్త సీఎం కేసీఆరే అన్నారు. పోచంపాడులో గురువారం మధ్యాహ‍్నం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అతి తక్కువ ముంపు, అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు అందించే ప్రాజెక్టు పోచంపాడు అని హరీశ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు వచ్చిందంటే రైతులకు ప్రాణం పోసినట్టే అన్నారు. సీఎం కేసీఆర్ రైతాంగాన్ని ఆదుకున్నారన్నారు. వరద కాలువను రిజర్వాయర్‌గా మార్చి రైతులకు రెండు పంటలు నీళ్లు అందిస్తున్న ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
కట్టిన ప్రాజెక్టులను ఎలా కాపాడాలో ఎన‍్నడూ కాంగ్రెస్ వాళ్లు ఆలోచించలేదన్నారు. రీడిజైన్ ద్వారా కేసీఆర్ ప్రాజెక్టులకు పునర్జీవం ఇచ్చారన్నారు. 40 డిగ్రీల ఎండలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడం సీఎం మీద మీకున్న భరోసా తెలుస్తుందని హరీశ్ అన్నారు. గోదారి నీళ‍్ళతో ఎస్సారెస్సీ ఆయకట్టు సస‍్యశ్యామలం అవుతుందని హరీశ్ ఆశాభావం వ‍్యక్తం చేశారు. 12 నెలల్లో ఎస్సారెస్సీ పనులు పూర్తి చేస్తామన్నారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ముంపుకు గురైన గ్రామస్థులకు తగిన సాయం చేస్తామని మంత్రి తెలిపారు. పనిచేయకపోయినా లిఫ్ట్ ఇరిగేషన్ మళ్లీ పనిచేసే అవకాశాలున్నాయన్నారు. అన్ని ప్రాజెక్టులు కళకళలాడుతాయన్నారు. సీఎం తీసుకున్న నిర‍్ణయం చరిత్రలో ఎవరూ సాధించనటువంటి నిర‍్ణయమన్నారు.