విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై భేటీ 

Meeting on electricity division - Sakshi

వచ్చేనెల 2,3 తేదీల్లో జస్టిస్‌ ధర్మాధికారి కమిషన్‌ సమావేశం  

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ డీఎం ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ మార్చి 2, 3వ తేదీల్లో హైదరాబాద్‌లో భేటీ కానుంది. ఈ మేరకు బుధవారం ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఏపీలోని విజయవాడలో ఉద్యోగ, కార్మిక సంఘాల అభిప్రాయాన్ని సేకరించిన కమిటీ ..తాజాగా వచ్చేనెల 2, 3 తేదీల్లో తెలంగాణ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కూడా సేకరి స్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే విద్యుత్‌ సంస్థలతో ఒకసారి సమావేశమైన కమిటీ ఇప్పుడు మరోసారి సమావేశానికి సిద్ధమయ్యింది. రెండ్రోజులుగా విజయవాడలో జరుగుతున్న భేటీలో ఏపీ సంఘాలన్నీ ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని నివేదించగా..రిలీవ్‌ అయిన ఉద్యోగులు మాత్రం తమ 1,157 మంది ఆప్షన్లను మాత్రమే పరిగణంలోకి తీసుకోవాలని కోరినట్లు సమాచారం.  

ఏపీకి వెళ్లేందుకు 621 మంది సిద్ధం 
రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి స్థానికతను 1 నుంచి 7వ తరగతి ఏ ప్రాంతంలో చదివితే, ఆ ప్రాంతానికి స్థానికుడిగా పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులను విభజించాలని డిస్కమ్‌లు పట్టుబడుతున్నాయి. ఏపీ ఉద్యోగ సంఘాలే కాకుండా విద్యుత్‌ సంస్థల ప్రతినిధులు కూడా ఉద్యోగులందరి దగ్గరి నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని కోరాయి. తెలంగాణ డిస్కమ్‌లలో పని చేస్తున్న ఏపీ స్థానికత కలిగిన 1,157 మంది ఉద్యోగులను ఏపీకి కేటాయించాలని, వీరిలో ఇప్పటికే 621 మంది ఏపీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ డిస్కమ్‌లు ఇప్పటికే ధర్మాధికారి కమిషన్‌కు నివేదించాయి. ఉద్యోగల విభజన సందర్భంగా పంజాబ్, బిహార్‌ రాష్ట్రాల తీర్పులను కూడా జోడించాయి. ఇక సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన ఆర్నెల్లలోపు ఉద్యోగుల విభజన సమస్యను తేల్చాల్సి ఉండగా ఇప్పటికే దీంట్లో మూడు నెలలు గడిచిపోయాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top