చిన్న ఉద్యోగాలు చేసి తృప్తి పొందక.. | MBA Graduate Performing Well In Business | Sakshi
Sakshi News home page

చిన్న ఉద్యోగాలు చేసి తృప్తి పొందక..

Mar 16 2020 8:29 AM | Updated on Mar 16 2020 8:29 AM

MBA Graduate Performing Well In Business  - Sakshi

సాక్షి, భానుపురి (సూర్యాపేట) : సరికొత్త పంథాలో ఉపాధి పొందుతూ సాటి నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువకుడు. సర్కారు కొలువే సాధించాలంటూ ఎదురు చూస్తూ కాలయాపన చేయకుండా స్వయం ఉపాధి బాట పట్టాడు. హైదరాబాద్‌ వంటి నగరాల్లో పలుచోట్ల చిన్నాచితకా ఉద్యోగాలు చేసినప్పటికీ వాటితో తృప్తి పొందక స్వశక్తితో ఆదాయాన్ని పొందేమార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా నాటుకోళ్లు, కుందేళ్లు, సీమకోళ్లు, కౌజు పిట్టల పెంపకానికి శ్రీకారం చుట్టాడు సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ధార శ్రీధర్‌.

సూర్యాపేట పట్టణానికి చెందిన ధార శ్రీధర్‌ ఎంబీఏ పట్టా పొందాడు. సర్కారు కొలువు పొందేందుకు సాధన చేస్తూ... ప్రైవేట్‌ ఉద్యోగాలు చేశాడు. ఈ ఉద్యోగాలతో సంతృప్తి పడని శ్రీధర్‌ సర్కారు ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తన సతీమణి ప్రణవి ప్రోత్సాహంతో ఓ కొత్తపంథాలో వ్యాపార మార్గాన్ని ఎంచుకున్నాడు. అరుదుగా ఉండే నాటుకోళ్లు, కుందేళ్లు, కౌజులను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని మినీట్యాంక్‌బండ్‌కు సమీపంలో ఉన్న లక్ష్మీగార్డెన్స్‌కు చేరువలో కొంత స్థలాన్ని నెలవారీ అద్దె ప్రాతిపదికన లీజుకు తీసుకున్నాడు. ఈ స్థలంలో కోబాల్‌ నాటుకోళ్లు.. కుందేళ్ల ఫామ్‌ ఏర్పాటు చేశాడు.

మేలైన జాతుల పెంపకం..
ఈ ఫామ్‌లో నాటుకోళ్లు, కుందేళ్లు, కౌజుల పెంపకంపై శ్రీధర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. స్థానిక వాతావరణానికి తట్టుకునేలా వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి మేలు జాతికి చెందిన నాటుకోళ్లు, కుందేళ్లు, కౌజులను తెప్పిస్తున్నాడు. ఖమ్మం, జగ్గయ్యపేట, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో నాటుకోడి పిల్లలు, కేరళ, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి కుందేళ్లను తెప్పిస్తున్నాడు. జిల్లా వాతావరణంలో కౌజుల పెంపకం అంత సులభం కాకపోయినప్పటికీ ఎంతో శ్రద్ధతో వికారాబాద్‌ జిల్లా నుంచి కౌజు పిల్లలను కొనుగోలు చేసి.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. అయితే గతంలో కౌజుల పెంపకాన్ని చేపట్టిన సంరక్షకులు, ఇతర నిపుణుల సూచనలతో కౌజులను వృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫామ్‌లో నాటుకోళ్లు, చీమకోళ్లు, కుందేళ్లు, కౌజులు అందుబాటులో ఉన్నాయి.

అమ్మకం ఇలా..
శ్రీధర్‌ ఈ ఫామ్‌ ఏర్పాటు కోసం మొదటగా రూ.1 లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. ఫామ్‌ను రన్‌ చేస్తుండగా.. ఇప్పటి వరకు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. ఫామ్‌లో పెరుగుతున్న నాటుకోళ్లు కిలో రూ.300 వరకు, కుందేళ్లు చిన్నపిల్లలైతే జత రూ.500, పెద్దవి కిలో రూ.500 చొప్పున, కౌజులు జత రూ.150 చొప్పున విక్రయిస్తున్నాడు. ఈ విక్రయాలతో నెలకు దాదాపు రూ.15వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నట్లు శ్రీధర్‌ పేర్కొంటున్నాడు.

అమ్మకాలు బాగున్నాయి
నాటుకోళ్లు, కుందేళ్లు, కౌజుల అమ్మకాలు బాగున్నాయి. ఎంబీఏ చేసి ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసినప్పటికీ.. స్వశక్తితో సంపాదించాలనే ఆలోచనతో ఈఫామ్‌ ఏ ర్పాటు చేశా. ఇందులో నా భార్య ప్రోత్సాహం ఎంతో ఉంది. ఈ వ్యాపారాన్ని ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది.       
    – శ్రీధర్, ఫామ్‌ యజమాని 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement