
ఇంటికొచ్చిన.. కంటి వెలుగులు
తల్లిదండ్రుల ఆశలను చిదిమేసిన మెదక్‌జిల్లా మాసాయిపేట బస్సుదుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్సలు పూర్తిచేసుకున్న చిన్నారులు బుధవారం డిశ్చార్జి కావడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వద్ద ఉద్వేగ భరిత వాతావరణం ఏర్పడింది.
* కోలుకున్న మాసాయిపేట బస్సుప్రమాద బాధిత చిన్నారులు
* మార్పులేని ఇద్దరి పరిస్థితి
సాక్షి,హైదరాబాద్: తల్లిదండ్రుల ఆశలను చిదిమేసిన మెదక్‌జిల్లా మాసాయిపేట బస్సుదుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్సలు పూర్తిచేసుకున్న చిన్నారులు బుధవారం డిశ్చార్జి కావడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వద్ద ఉద్వేగ భరిత వాతావరణం ఏర్పడింది. పిల్లల తల్లిదండ్రుల కళ్లనుంచి ఆనందబాష్పాలు రాలాయి. ఈ నెల 24న ఇక్కడ చికిత్సకు వచ్చిన కాకతీయ స్కూలు విద్యార్థుల్లో 9 మంది ఏడు రోజుల చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లారు. మాసాయిపేట్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 20 మంది విద్యార్థులను చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించిన విషయం విదితమే. గత రెండు రోజుల క్రితమే 12 మంది పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. వారి తల్లిదండ్రులు మరో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోని వారిని ఉంచాలని కోరడంతో ఆస్పత్రి వర్గాలు సమ్మతించాయి. ఆమేరకు వారిని బుధవారం డిశ్చార్జి చేశాయి.
వీరిలో సాయిరాం(4), సాత్విక(6), మహిపాల్‌రెడ్డి(4), సద్భావన్‌దాస్(3), కరుణాకర్(9), సందీప్(5), అభినందు(9),శివకుమార్(5), హరీష్(7)లను ఇంటికి పంపించారు. రుచితగౌడ్(8), శ్రావణి(6), త్రిష అలియాస్ శిరీష(8)ల తల్లిదండ్రులు ఇంకా రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచుతామని చెప్పడంతో వారిని ప్రత్యేక వార్డుకు తరలించారు. దర్శన్‌గౌడ్(6), నబీరాఫాతిమా(9), నితూష(7) ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. శరత్(6) పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రశాంత్(6), వరుణ్‌గౌడ్(7)ల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
డిశ్చార్జ్ అయి వెళుతున్న విద్యార్థుల వద్దకు ప్రతీరోజు ఇద్దరు డాక్టర్లు, నలుగురు నర్సులు, పారామెడికల్ సిబ్బంది వెళ్లి అవసరమైన చికిత్స, డ్రెస్సింగ్ లాంటివి చేస్తారని యశోద ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ లింగయ్య చెప్పారు. వారం రోజులకు సరిపడే మందులు కూడా ఇచ్చామన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా వైద్యులతో ఫోన్‌లో సంప్రదించవచ్చని, ఆస్పత్రికి వచ్చి ఉచిత వైద్య సేవలు పొందవచ్చన్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని వైద్యులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా డిశ్చార్జ్ అయి వెళ్లిపోతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు ఆరోగ్యంగా ఇళ్లకు వస్తుండడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను యశోద ఆస్పత్రి, 108 ఆంబులెన్సులలో స్వగ్రామాలకు తరలించారు.
మాసాయిపేట రైల్వే మృతులకు టీడీపీ సాయం
బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన నారా లోకేష్
తూప్రాన్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ బుధవారం తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్ గ్రామాల్లో సాయం అందజేశారు. రైలు ప్రమాదం బాధితులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ ట్రస్ట్ తరపున రైల్వే ప్రమాద ంలో మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రులకు రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు.
అలాగే వర్గల్ మండలం వెలురూలోని బస్సు డ్రైవర్ బిక్షపతిగౌడ్, తూప్రాన్ మండలం ఘనపూర్‌కు చెందిన బస్సు క్షీనర్ రమేశ్ కుటుంబ సభ్యులకు రూ. లక్ష చెక్కును అందజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారుల చదువులకు ఎన్‌టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందన్నారు. అలాగే, రైలు ప్రమాద ఘటనా స్థలంలో నారా లోకేష్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు గాంధీ, వివేకానందగౌడ్, మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శశికళా యాదవరెడ్డి, గజ్వేల్, జహీరాబాద్, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల నాయకులు మృతుల ఆత్మశాంతికి శ్రద్ధాంజలి ఘటించారు.