
వీసా రెన్యువల్ కాలేదని ఆత్మహత్య
హాయిగా సాగుతున్న ఓ కుటుంబంలో అమెరికా అధ్యక్షుడి నిర్ణయాల వల్ల విషాదం నెలకొంది. అమెరికాలో నివసి ంచేందుకు అక్కడి కొత్త నిబంధనలతో వీసా రెన్యువల్ కాలేదనే బెంగతో ఓ వివాహిత
♦ ట్రంప్ నిబంధనలతో అమెరికా నుంచి తిరిగొచ్చిన దంపతులు
♦ మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకున్న వివాహిత
హైదరాబాద్: హాయిగా సాగుతున్న ఓ కుటుంబంలో అమెరికా అధ్యక్షుడి నిర్ణయాల వల్ల విషాదం నెలకొంది. అమెరికాలో నివసి ంచేందుకు అక్కడి కొత్త నిబంధనలతో వీసా రెన్యువల్ కాలేదనే బెంగతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎస్సై విజయ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన సంజీవ్ శర్మ, రాశ్మీ శర్మ (39) నెలరోజుల కింద అమెరికా నుంచి వచ్చి పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ట్విన్‌డైమండ్ అపార్ట్‌మెంట్‌లోని సొంత ఫ్లాట్‌లో ఇద్దరు కుమారులతో కలసి నివసిస్తున్నారు. అంతకుముందు సంజీవ్‌శర్మ హైదరాబాద్‌లోని పలు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. అవకాశం రావటంతో అమెరికా వెళ్లారు. అక్కడ సంజీవ్ పనిచేస్తుండగా రాశ్మీశర్మ ఇంట్లోనే ఉండేది. ఇటీవల అమెరికాలో వచ్చిన కొత్త నిబంధనలతో సంజీవ్ పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ అమెరికా సంస్థ వారి వీసా పొడిగించేందుకు నిరాకరించింది.
దీంతో చేసేదేమిలేక ఇక్కడికి వచ్చారు. గురువారం ల్యాప్‌టాప్ రిపేర్ కోసం కుమారులను తీసుకుని సంజీవ్ బయటకు వెళ్లాడు. వారు తిరిగొచ్చే సరికి ఇంట్లో రాశీశర్మ చీరతో ఉరి వేసుకుని కనిపించింది. కుటుంబ కలహాలతో పాటు అమెరికాలో భర్త ఉద్యోగం పోవటంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.