భూమి కోసం తిరిగి అలసిపోయా..

mallojula maduramma about her land - Sakshi

మల్లోజుల మధురమ్మ

పెద్దపల్లి: స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుండగా, తనకు 1988లో రామగుండం మండలంలో ఇచ్చిన భూమి దస్త్రాలు ఇప్పటికీ చేతికందలేదని మల్లోజుల మధురమ్మ వాపోయారు. స్వాతంత్య్ర సమరయోధుడైన మల్లోజుల వెంకటయ్య భార్య, మావోయిస్టు పార్టీ అగ్రనేతలు కిషన్‌జీ, వేణుగోపాల్‌ల తల్లి మధురమ్మను గణతంత్ర వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మధురమ్మ మాట్లాడుతూ ‘భూమి కోసం 25 ఏళ్లుగా తిరుగుతూ అలసిపోయా.. రామగుండం మండలం ముర్ముర్‌లో సర్వే నం. 126లో 8 ఎకరాల స్థలం కేటాయించి కాగితాలు అప్పగించారు. ఓ ఏడాది వ్యవసాయం చేసుకున్నాం. ఆ తర్వాత పట్టా సర్టిఫికెట్‌ల కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఆశలు వదులుకున్నా. ఇంటికి వచ్చిన ఎస్పీలకు ఈ విషయాన్ని తెలిపితే వెంటనే ఆర్డీవోలతో మాట్లాడిన వారెందరో ఉన్నారు.

అయినా సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. 50 ఏళ్లలో వందలసార్లు స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రాలు అందాయి, ఉద్యమంలో పని చేసిన కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇచ్చిన భూమి చేతికి దక్కకుండా పోయింది.’అన్నారు. కనీసం 69వ గణతంత్ర వేడుకల సందర్భంగానైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన భూమికి పట్టా సర్టిఫికెట్ల అధికారాలు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top