‘తెల్లావారక ముందే పల్లె లేచింది / తనవారినందరినీ తట్టీ లేపింది’ అని అప్పట్లో సినీకవి మల్లెమాల ఓ పాటలో పల్లె సీమల వైభవాన్ని అక్షరబద్ధం చేశారు. అక్కడ పాలావెల్లిలాంటి మనుషులు / పండు వెన్నెల వంటి మనసులు / మల్లెపూల రాశివంటి మమతలు / పల్లెసీమలో కొకొల్లలూ అంటూ ఎంతో గొప్పగా చెప్పారాయన. కానీ ఇవాళ నూజెండ్లలోని కొన్ని గ్రామాల్లో ఆ దృశ్యాలు, ఆ సన్నివేశాలు అదృశ్యమయ్యాయి. పచ్చగా ఉండాల్సిన ఈ సీమలో జనజీవనం దుర్భరమై వలసబాట పడుతున్నారు.
పల్నాడు జిల్లా: పచ్చని పల్లెలు రానురాను కనుమరుగవుతున్నాయి. పట్టణ సౌకర్యాల కోసం కొందరు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం మరికొందరు గ్రామాలను వీడిపోతున్నారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండల పరిధిలో ఇలా కొన్ని ఊర్లు శిథిలావస్థకు చేరుకోగా మరికొన్ని వలస బాటలో పడుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. అక్కడ ఉన్న వరి, మిర్చి పండే పంట పొలాల్లో సుబాబులు తోటలు పెంపకం చేపడుతున్నారు.
రికార్డుల్లోనే ఊరు... జనం కానరారు!
ఉదాహరణకు మండల పరిధిలోని సుధాకర్‌నగర్ ఈ కోవకు చేరుతుంది. అటవీ ప్రాంతమైన భూమిని 2005లో డీ ఫారెస్టు చేసి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఖాళీ భూములు లబి్ధదారులకు పంపిణీ చేశారు. ఆ విధంగా 30 పైగా కుటుంబాలతో సుధాకర్ నగర్ ఏర్పాటైంది. ప్రభుత్వం సిమెంట్ రోడ్లు, పాఠశాల భవనాలు నిర్మించింది. కనీస సౌకర్యాల పేరుతో అక్కడి వారు కాలక్రమంలో నగరాలకు తరలిపోవటంతో ప్రస్తుతం రెండు మూడు ఇళ్ళు మాత్రమే మిగిలాయి. ప్రస్తుతం ఈ గ్రామ స్థానంలో సుబాబుల్ తోటలు మిగిలాయి.
అలాగే కమ్మవారిపాలెంలో నాడు 100 కు పైగా నివాసాలు ఉండగా నేడు ఆ సంఖ్య 25 కి పడిపోయింది. ప్రస్తుతం ముసలివారు తమ పొలాêలు చూసుకుంటు స్థానికంగా ఉంటున్నారు. ఇదే వరుసలో రెడ్డిపాలెం ఉంది. గ్రామానికి చెందిన చాలా కుటుంబాలు వ్యాపార రీత్యా ఇక్కడి నుంచి తరలిపోయారు. మిగిలిన కుటుంబాల వారు సమీపంలోని గ్రామం దాట్లవారిపాలెంలో ఉంటున్నారు. ప్రస్తుతం గ్రామం ఆనవాళ్లుగా పాడుపడిన పాఠశాల మాత్రమే ఉంది. ఇదే వరుసలో రవ్వరం సమీపంలోని జె.సి.నగర్, మేకపాడు గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాల వారు పనుల కోసం వలస వెళ్లిపోయారు. ఆక్కడా పదుల సంఖ్యలో మాత్రమే నివాసం ఉంటున్నారు.
ఆదాయ మార్గాలు పెరగాలి
వ్యవసాయం లాభసాటిగా లేకపోవటం, ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంతో వలసలు పెరుగుతున్నాయి. గ్రామాల్లోనూ కనీస సౌకర్యాలు పెంపొందించి పట్టణాలతో సమానంగా ఆదాయ వనరులు పెంచితే కొంత మేర వలసలు నివారించవచ్చని పల్లె ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పల్లె ప్రాంతాలకు సమీపంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు దక్కించుకున్న యువత పల్లెల్లోనే నివాసం ఉండే అవకాశాలు మెరుగవుతాయి.


