
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపం మరోసారి కొట్టొచ్చినట్లు కనిపించింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పార్టీ రంగారెడ్డి జిల్లా అభ్యర్థి ఖరారు విషయంలో హైడ్రామా నడిచింది. తొలుత అభ్యర్థిగా ప్రకటించిన టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.ఉదయ్ మోహన్‌రెడ్డి పేరును పార్టీ చివరి నిమిషంలో మార్చింది. ఆయన స్థానంలో జనగామ జిల్లాకు చెందిన కొమ్మూరి ప్రతాపరెడ్డిని అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది. వాస్తవానికి నల్లగొండ, వరంగల్ స్థానాలతోపాటు రంగారెడ్డి జిల్లా అభ్యర్థిని కూడా సోమవారమే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అధికారికంగా ప్రకటించారు. కానీ తెల్లారేసరికి సోమవారం ప్రకటించిన ఉదయ్‌మోహన్ స్థానంలో కొమ్మూరి ప్రతాపరెడ్డి నామినేషన్ వేశారు. అయితే ఉదయ్‌మోహన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి కూడా నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం.
అసలు ఏం జరిగిందంటే...
రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి లాంటి నేతలను పోటీలో ఉంచాలని టీపీసీసీ తొలుత భావించినా వారు ఆసక్తి చూపలేదు. అయితే టీఆర్‌ఎస్ ప్రకటించిన ముగ్గురు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు సైతం అదే సామాజికవర్గం వారు కావడంతో రంగారెడ్డి స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ పేరును పరిశీలించారు. కానీ కొత్త నేత అయితే బాగుంటుం దనే ఆలోచనతో టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉన్న శంకరపల్లి మండలానికి చెందిన ఉదయ్‌మోహన్‌రెడ్డిని ఎంపిక చేశారు. ఆయన అభ్యర్థిత్వం పట్ల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా తొలుత మొగ్గు చూపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఉదయ్‌మోహన్ పేరును మీడియాకు వెల్లడించే క్రమంలో శషభిషలు మొదలయ్యాయి. ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ నిర్ణయించగా ఎంపీ కొండాతోపాటు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి విభేదించారు.
అయినా మిగిలిన రెండు జిల్లాల అభ్యర్థులతోపాటు రంగారెడ్డి జిల్లా అభ్యర్థిగా ఉదయ్ పేరును ఉత్తమ్ ప్రకటించారు. ఇదే పేరును ఏఐసీసీకి పంపగా అక్కడ కూడా ఆమోదం లభిం చింది. దీంతో కొండా, పైలట్ చేతులెత్తేశారు. ఉదయ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే ఆయన్ను గెలిపించే బాధ్యత తీసుకోలేమని, తాము చెప్పిన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. మరోవైపు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి సైతం బరిలో నిలుస్తానని ప్రకటించడంతో పీటముడి పడింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో స్థానిక నాయకత్వం ఒత్తిడికి తలొగ్గిన టీపీసీసీ... చివరి నిమిషంలో జనగామ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. అయితే అభ్యర్థిత్వం మార్పు విషయంలో పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. అభ్యర్థుల మార్పు అనేది సహజమైన ప్రక్రియే అయినా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిని మార్చిన విధానమే పార్టీకి మంచిది కాదని, అది కూడా జిల్లా నాయకుడిని కాకుండా వలస నేతను ఇక్కడ నిలబెట్టడం ఏమిటనే వాదన వినిపిస్తోంది. గెలిచినా, ఓడినా జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని స్థానిక నాయకులకే ఇవ్వాలి కానీ ఒకరిద్దరు నేతలు ఒత్తిడి చేశారని వలస నేతను పట్టుకొస్తే తమ పరిస్థితి ఏమిటని జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.