‘గ్రేటర్‌’ ట్రాఫిక్‌ కమిషనరేట్‌

KTR Speaks At GHMC And Police Chiefs Meeting - Sakshi

ట్రాఫిక్‌ను ‘దారి’లో పెట్టేందుకు కొత్త వ్యవస్థ

ప్రజా రవాణా రంగం మెరుగుకు చర్యలు

అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్ల అభివృద్ధి

జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మహా నగరంలో వాహనాలతోపాటు పాదచారులు సౌకర్యవంతంగా ప్రయాణిం చేలా రోడ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ట్రాఫిక్‌ వ్యవస్థను శాస్త్రీయంగా క్రమబద్ధీకరిస్తామని, దీని సమన్వయానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రత్యేక ట్రాఫిక్‌ కమిషనరేట్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

గురువారం బుద్ధభవన్‌లో జీహెచ్‌ఎంసీ, పోలీసు, విద్యుత్, టీఎస్‌ఐఐసీ, జలమండలి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ, నగర ప్రజలను ప్రజా రవాణా వైపు మళ్లించేలా వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. వాణిజ్య ప్రాంతాల్లోని సెట్‌బ్యాక్‌ల స్థలాన్ని ఫుట్‌వేలకు వినియోగించనున్నట్లు తెలిపారు. ముంబైలో ప్రజారవాణా వినియోగం 72 శాతం కాగా, నగ రం లో 34 శాతమేనన్నారు. ఐదేళ్లలో వాహనాల సంఖ్య 73 లక్షల నుంచి కోటీ ఇరవై లక్షలకు పెరిగిందన్నారు.

ప్రజా రవాణా పెంపే లక్ష్యం
మెట్రోరైలు, ఎంఎంటీఎస్‌ వ్యవస్థల అభివృద్ధితో పాటు ప్రధాన మార్గాల్లో లేనింగ్‌లు, ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, సైకిల్‌ మార్గాలు ఏర్పాటు చేస్తామని, పచ్చదనాన్ని పెంచుతామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఖాళీ స్థలాలను పార్కింగ్‌ ప్రదేశాలుగా మార్చేందుకు ప్రైవేట్‌ యజమానులను ఒప్పించాలని, తద్వారా ఆదాయం పొందొచ్చనే విషయాన్ని వారికి తెలపాలన్నారు. లేఔట్ల ఓపెన్‌ ప్రదేశాల్లో ప్రజల సదుపాయార్థం పబ్లిక్‌ టాయ్‌లెట్లు, పార్కులు, బస్‌షెల్టర్లు, స్కైవాక్‌ వేలు ఏర్పాటు చేస్తామన్నారు.

డయల్‌ ‘100’కు విస్తృత ప్రచారం
మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ 100కు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. వైన్స్‌ పరిసరాల్లో మద్యం తాగే వారిపై చర్యలు తీసుకోవాలని, సంబంధిత దుకాణాలను మూసివేయించాలని సూచించారు. పార్కులు, ఖాళీ స్థలాలు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారరాదన్నారు. నగరంలో 4 లక్షల ఎల్‌ఈడీ లైట్లున్నాయని, ఇంకా అదనంగా ఏర్పాటు చేస్తామన్నారు.

డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, రోడ్లు, రవాణా సదుపాయాలు బాగుంటే ట్రాఫిక్‌ సమస్యలుండవన్నారు. ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఆధునీకరణకు నిధులివ్వాలని కోరారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, మునిసిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆ రోడ్ల బాధ్యత ప్రైవేట్‌ ఏజెన్సీలదే
సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం (సీఆర్‌ఎంపీ) కింద 709 కి.మీ. మేర ప్రధాన రోడ్ల నిర్వహణను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించామని, ఈనెల 9 నుంచి ఏజెన్సీలు పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జోనల్‌ కమిషనర్లను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఐదేళ్ల వరకు ఆ రోడ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్ట్‌ ఏజెన్సీలదేనని, పైప్‌లైన్లు, కేబుళ్లు, డ్రైనేజీ తవ్వకాలు, మరమ్మతులు, పునరుద్ధరణ పనులన్నీ ఏజెన్సీలే చేపట్టాలన్నారు. 

వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top