మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు వేయాలి: కేటీఆర్‌

KTR Says Telangana Is Only State That Gives Rythu bandhu In 70 years - Sakshi

సాక్షి, సిరిసిల్ల : రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలు నింపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాభై ఏళ్లలో ఎన్నడూ చూడని అద్భుత దృశ్యం ప్రస్తుతం చూస్తున్నామన్నారు. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల ఎడారిలాగా ఉండేదని, ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు దూకి పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయన్నారు. అన్నం తెలియదని వెక్కిరిచ్చిన వాళ్ల చెంపపై కొట్టేలా దేశానికే అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదుగుతున్నారని ప్రశంసించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచే అత్యధిక  ధాన్యం కొనుగోళ్లు జరిగాయని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. (తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు)

దేశంలో 70 ఏళ్లలో రైతుబంధు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా రైతు బంధు విడుదల చేశారని తెలిపారు. మిడ్ మానేరు నిండటంతో సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని, దేశంలో ఇదే రికార్డు అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముస్సోరీలోని సివిల్ సర్వీస్ ఐఎఎస్ అధికారులకు శిక్షణలో పాఠాలుగా బోధిస్తున్నారని, ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వ కారణమని కేటీఆర్‌ కొనియాడారు. కరెంటు మీద ఆధారపడకుండా 2 పంటలు పండించి చూపిస్తామని తెలిపారు. తెలంగాణ వచ్చాక ఇంత త్వరగా నీళ్లొస్తాయని ఎవరూ ఊహించలేదని, సముద్రానికి 82 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను 618 మీటర్ల పైన కొండపోచమ్మకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చారని ప్రస్తావించారు. (తనకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదని)

1.25 కోట్ల ఎకరాల భూములకు సాగునీరిచ్చి రెండో హరిత విప్లవం తీసుకు వస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గ్రామాల్లో రైతు బాగుంటే అన్ని కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక రైతు బిడ్డ అని, ఆయనకు రైతుల సమస్యలు తెలుసని అన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కూడా కేసీఆర్‌ పట్ల అపారమైన నమ్మకం ఉందన్నారు. ఏ ఒక్క పథకాన్ని ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రతీ గ్రామపంచాయతీకి  తిరిగి ప్రతీ రైతుకు రైతుబంధు అందేలా చూడాలని సూచించారు. (ముత్తిరెడ్డిని కలిసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే)

జులై 15 తేదీ లోపు జిల్లాలో ఏ భూమిలో ఏ పంట వేశారో అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్ర నివేదిక అందించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. రైతు బంధు విషయంలో కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని హితవు పలికారు. రైతుల కోసం ఎన్నో పనులు చేసిన కేసీఆర్ మించిన ముఖ్యమంత్రి లేరని, రైతులకు మద్ధతు ధరకు మించి డబ్బులు రావాలన్నదే సీఎం ఆలోచన అని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకే నియంత్రిత పంటల విధానం తెచ్చామని,  మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయడం వల్ల రైతు ధనవంతుడు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. తాను చెప్పిందే వేయాలని సీఎం కేసీఆర్ చెప్పడం లేదని, డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలని చెబుతున్నారని పునరుద్ఘాటించారు. రైతు వేదికల ద్వారా అన్నదాతలను సంఘటితం చేసి బంగారు పంటలు పండేలా సమాలోచనలు చేసుకోవచ్చని రైతులకు కేటీఆర్‌ సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top