ఆ మందులు ఎవరెవరు కొన్నారు?

KTR Review Meeting with authorities to Prevent Covid-19 - Sakshi

జ్వరం, గొంతు నొప్పి మందులు కొన్న వారి వివరాలు సేకరించండి

కరోనా వ్యాపిస్తు్తన్న ప్రస్తుత పరిస్థితుల్లో సొంత వైద్యం ప్రమాదకరం

కంటైన్మెంట్‌ జోన్లలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలి..

అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్‌ స్పష్టీకరణ  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో సొంత వైద్యం మరింత ప్రమాదమని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా లక్షణాలైన జ్వరం, గొంతు నొప్పి నివారణకు ఇటీవల కాలంలో మెడికల్‌ షాపుల నుంచి మందులు కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకోవాలని ఆదేశించారు. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల సహకారంతో ఆయా మున్సిపాలిటీల్లోని ఫార్మసీ అసోసియేషన్‌ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై సమాచారాన్ని సేకరించాలన్నారు. జ్వరం, గొంతు నొప్పి మందులను కొనుగోలు చేసిన వారి వివరాలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి మంత్రి కేటీఆర్‌ శుక్రవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో  వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహించారు. కంటైన్మెంట్‌ జోన్లలోని ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాలని మున్సిపల్‌ కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లను కేటీఆర్‌ ఆదేశించారు.

ఉల్లంఘిస్తే కేసులే..
కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కంటైన్మెంట్‌ జోన్లలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో 260 కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేస్తే, జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 146 జోన్లు ఉన్నాయన్నారు. ఇతర జిల్లాల్లోని 43 మున్సిపాలిటీల్లో మిగిలిన 114 కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నట్లు తెలిపారు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మెడిసిన్స్‌ను  ఇళ్ల వద్దకే సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన వలంటీర్లు, సిబ్బందితో మాత్రమే నిత్యావసరాలను డోర్‌ డెలివరీ చేయించాలన్నారు. వీలైతే వలంటీర్లు, సిబ్బందికి ప్రత్యేక దుస్తులు అందజేయాలన్నారు.

కంటైన్మెంట్‌ జోన్లలోకి దాతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోరాదన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలోని కుటుంబాల మొబైల్‌ నంబర్లతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి, అవసరాలను తెలుసుకోవాలన్నారు. కంటైన్మెంట్‌ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.  ప్రజల సహకారం పైనే కంటైన్మెంట్‌ జోన్ల తొలగింపు ఆధారపడి ఉంటుందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 కంటైన్మెంట్‌ జోన్లను తొలగించినట్లు మంత్రి ఉదహరించారు. వలస కార్మికులు తమ రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లేందుకు తొందరపడుతున్నప్పటికీ, రోడ్లపైకి ఎవరిని అనుమతించరాదని తెలిపారు. వలస కార్మికులకు ప్రస్తుతం వారున్న ప్రాంతంలోనే భోజన సదుపాయాలు కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top