సగం ఖర్చు భరిస్తాం

KTR Request About Bayyaram Steel Factory To PM Narendra Modi - Sakshi

బయ్యారం స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయండి

ప్రధాని మోదీకి కేటీఆర్‌ విజ్ఞప్తి

బైలదిల్లా గనులతో లింకేజీ ఇస్తే ఉక్కు కర్మాగారం సాధ్యమే

ప్లాంటుకు సదుపాయాలన్నీ కల్పిస్తామని హామీ

సాక్షి, న్యూఢిల్లీ : బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని.. దానికి అవసరమైన అన్ని రకాల రాయితీలూ ఇస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే సగం ఖర్చు భరించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని నివేదించారు. దానితోపాటు హైదరాబాద్‌లో ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌)’ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధానితో ఈ నెల 15న సీఎం కేసీఆర్‌ సమావేశమై విభజన చట్టంలో పేర్కొన్న, గతంలో కేంద్రం ప్రకటించిన 10 హామీల అమలుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అందులోని బయ్యారం స్టీల్‌ ప్లాంట్, ఐటీఐఆర్‌ ఏర్పాటుకు సంబంధించి.. రాష్ట్ర మంత్రిత్వ శాఖ ద్వారా మరింత సమాచారం ఇవ్వాలని ప్రధాని సూచించారు. ఈ మేరకు బుధవారం మధ్యా హ్నం ఢిల్లీలో ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన కేటీఆర్‌.. ఈ రెండు అంశాలపై మరింత సమాచారాన్ని సమర్పించారు. 

‘బైలదిల్లా’తో లింకేజీ ఇవ్వండి.. 
బయ్యారంలో లభించే ఇనుప ఖనిజం నాణ్యత తక్కువగా ఉంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనుల నుంచి ఖనిజాన్ని తరలించి ఉక్కు ఉత్పత్తి చేయవచ్చని ప్రధానికి కేటీఆర్‌ వివరించారు. ప్రస్తుతం బైలదిల్లా నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుకు ఖనిజాన్ని తరలిస్తున్నారని.. అలాంటిది కేవలం 180 కిలోమీటర్ల దూరంలోని బయ్యారానికి సులువుగా తరలించవచ్చని చెప్పారు. బైలదిల్లా నుంచి లింకేజీ ద్వారా బయ్యారంలో స్టీలు ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని నివేదించారు. ఇక్కడ ప్లాంటు ఏర్పాటు వల్ల ఖమ్మం జిల్లా పరిధిలోని గిరిజనులకు 15 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని.. అందువల్ల ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన అన్ని వసతులను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానికి కేటీఆర్‌ వివరించారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం సగం ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉందని.. సింగరేణి, టీఎస్‌ఎండీసీ సంస్థల ద్వారా సహకారం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే రైల్వేలైన్‌ ఫీజిబులిటీ అధ్యయనానికి రూ.2.5 కోట్లు విడుదల చేశామన్నారు. 

ఐటీఐఆర్‌ కింద నిధులివ్వండి 
ఐటీ రంగంలో జాతీయ వృద్ధి 7–8 శాతంగా ఉంటే తెలంగాణలో 9.3 శాతంగా ఉందని.. ఏటా రూ.93,422 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు తెలంగాణ కేంద్రంగా జరుగుతున్నాయని ప్రధానికి కేటీఆర్‌ వివరించారు. దీనిని మరింతగా ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో ఐటీ అనుబంధ సంస్థల పెట్టుబడుల ఊతమిచ్చేలా గత ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్‌ ద్వారా నిధులు విడుదల చేయాలని కోరారు. సైబరాబాద్, గచ్చిబౌలి, మాదాపుర్, మామిడిపల్లి, రావిర్యాల్, ఆదిభట్ల, మహేశ్వరం, ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో ఐటీ రంగం వృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పనకు ఐటీఐఆర్‌ తోడ్పడుతుందన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,863 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అంగీకారం కూడా తెలిపిందని వివరించారు. కానీ కొంతకాలంగా ఈ ప్రాజెక్టుపై ప్రతిష్టంభన నెలకొందన్నారు. ఈ అంశంలో సహకరించాలని కోరారు. 

ప్రధాని సానుకూలం..: కేటీఆర్‌ 
బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్‌ల ఏర్పాటుపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రధానితో ఇటీవల సీఎం కేసీఆర్‌ సమావేశమైన సందర్భంగా.. బయ్యారం, ఐటీఐఆర్‌లపై మరింత సమాచారాన్ని ప్రధాని కోరారని చెప్పారు. ఇలా ప్రధాని తనకుతానుగా ఈ సమాచారాన్ని కోరారు కాబట్టి త్వరలోనే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

యూఏఈ రాయబారితో భేటీ.. 
ఢిల్లీలో ప్రధానితో భేటీ అనంతరం యూఏఈ భారత రాయబారి మహ్మద్‌ అల్బన్నాతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు పరస్పర అవగాహన ఒప్పందాలకు సంబంధించి చర్చించారు. తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను, ఇతర అంశాలను కేటీఆర్‌ వివరించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top