మహాకూటమికి గుణపాఠం చెప్పాలి

KTR Comments On Grand Alliance Rangareddy - Sakshi

మైలార్‌దేవ్‌పల్లి: మహాకూటమి పేరుతో వస్తున్న వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకాష్‌గౌడ్‌ విజయాన్ని కాంక్షిస్తూ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ దుర్గానగర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలను పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్, టీడీపీలు ఇప్పుడు కూటమి పేరుతో మీ ముందుకు వస్తున్నాయన్నారు. ఆ పార్టీ నాయకులకు బుద్ధిచెప్పాలన్నారు.  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేవలం నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే చేసి చూపెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. రంగారెడ్డి శివారు ప్రాంతాల్లో ఉన్న 35 లక్షల కుటుంబాలకు 2 వేల కోట్ల ఖర్చుతో ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు.

నెక్నాంపూర్, గండిపేట చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. గండిపేట చెరువును అంతర్జాతీయ స్థాయిలో పర్యటక కేంద్రంగా చేసేందుకు గాను ఇప్పటికే రూ.100 కోట్లు  విడుదల చేశామన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గాన్ని రానున్న మూడు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేస్తూ నగరానికి నలుదిక్కులా మెట్రో రైలు సౌకర్యం కల్పిస్తామన్నారు. శంషాబాద్‌ కొత్వాల్‌గూడలో రూ.100 కోట్లతో నైట్‌ సఫారీ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

లక్ష్మిగూడలో వంద పడకల ఆసుపత్రి మంజూరైనట్టు తెలిపారు. రూ.541 కోట్లతో నగర శివారులోని చెరువు ఆధునీకరణకు విడుదల చేయడం జరిగిందన్నారు.  మూసీ నది సుందరీకరణతో పాటు పర్యావరణం దెబ్బతినకుండా 111 జీవోను వెసులుబాటు చేసుకునేందుకు ఆలోచిస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలో 43 లక్షల మందికి వృద్ధాప్య పెన్షన్‌ అందుతుందన్నారు. దానిని రూ.2016కు పెంచుతామన్నారు. రాజేంద్రనగర్‌లో ఇప్పటికే 3వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, హిమాయత్‌సాగర్‌లో కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉందని అందులో అర్హులను గుర్తించి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కట్టించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుంచి పాత్రినిత్యం వహించి మంత్రులుగా చలామని అయిన వారంతా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, రాజేంద్రనగర్‌ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ అన్నారు.

పది సంవత్సరాల పాటు సబితాఇంద్రారెడ్డి కిస్మత్‌పూర్‌ బ్రిడ్జీని నిర్మించలేకపోయారని అన్నారు. తాను కేటీఆర్‌తో చర్చించి రూ.8 కోట్లు వెచ్చించి కిస్మత్‌పూర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామోహన్, వక్ఫ్‌బోర్డు  చైర్మన్‌ సలీం, నాయకులు విప్లవ్‌కుమార్, నాగేందర్, వెంకటేష్, మహ్మద్‌ ముర్తుజా అలీ, వెంకటేష్, లక్ష్మిరాజ్, మల్లేష్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ ప్రేమ్‌దాస్‌గౌడ్, బండ చంద్రారెడ్డి, జయశ్రీసదానంద్, మాలతీనాగరాజ్, సురేష్‌గౌడ్, మహేందర్‌గౌడ్, ప్రేమ్‌గౌడ్, సాయిబాబా,  అజయ్, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top