క్రస్ట్‌గేట్లపై పాలధారలు..!

Krishna Water Flows From the Crest Gates at Nagarjuna Sagar Dam - Sakshi

సాగర్‌లో నిలిచిన కృష్ణమ్మ పరవళ్లు 

గరిష్ట స్థాయిలో ప్రాజెక్టు నీటిమట్టం

నిండుకుండలా జలాశయం

ఎగువనుంచి వరద ప్రవాహం పూర్తిగా తగ్గడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను అధికారులు మూసివేశారు. జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఎగిసి పడుతున్న అలలు క్రస్ట్‌ గేట్లను తాకుతున్నాయి. దీంతో వాటి పైనుంచి కృష్ణమ్మ పాలధారలుగా కిందికి దుముకుతున్న దృశ్యాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.  

నాగార్జునసాగర్‌: సాగర్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు ఆగాయి. కృష్ణాపరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలలోని పశ్చిమకనుమలలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణాబేసిన్‌లోని జలాశయాలన్ని రెండు సార్లు గరిష్టస్థాయి నీటిమట్టాలకు చేరుకున్నాయి. అదనంగా వచ్చిన వరదనంతా అధికారులు దిగువకు విడుదల చేశారు. వర్షాకాలం అక్టోబర్‌ నెలాఖరు వరకు ఉంటుంది. వరుణుడు కరుణిస్తే మరోసారి గేట్లు ఎత్తే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. ఆరేళ్ల క్రితం అక్టోబర్‌ మాసంలో స్థానికంగా కురిసిన వర్షాలకు వరదలు వచ్చి జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో  క్రస్ట్‌గేట్లెత్తారు.

నిండుకుండలా..
శ్రీశైలం నాగార్జునసాగర్‌ జలాశయాలు గరిష్టస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా జలకళను సంతరించుకున్నాయి. సాగర్‌ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 590అడుగులున్నది. 312.0450 టీఎంసీల నీరుంది. క్రస్ట్‌గేట్లమీదనుంచి అలలు దిగువకు దుముకుతూ ధవలకాంతులను పోలి కృష్ణమ్మ తెల్లని నురుగులతో అందాలను ఆరబోస్తోంది. ఎగువనగల శ్రీశైలం జలాశయం నుంచి గడిచిన 24గంటల్లో 1,22,377క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. దిగువకు 1,18,919 క్యూసెక్కులనీటిని విడుదల చేశారు.  ప్రస్తుతం సాగర్‌కు 52,827 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా అంతే మోతాదులో విద్యుదుత్పాదన, పంటకాల్వలల ద్వారా నీటిని పంపుతున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్టస్థాయి నీటిమట్టం 885.00అడుగులు కాగా ప్రస్తుతం 884.20 అడుగులున్నది. ఎగువనుంచి 98,000క్యూసెక్కులనీరు వచ్చి చేరుతుండగా విద్యుదుత్పాదన కేంద్రాలు పోతిరెడ్డిపాడు ద్వారా 94,578క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top