ఫ్రూట్‌ మార్కెట్‌ మూడు ముక్కలు! | Kothapet Fruit Market Divided Three Places in Hyderabad | Sakshi
Sakshi News home page

ఫ్రూట్‌ మార్కెట్‌ మూడు ముక్కలు!

May 12 2020 7:47 AM | Updated on May 12 2020 7:47 AM

Kothapet Fruit Market Divided Three Places in Hyderabad - Sakshi

సాక్షి సిటీబ్యూరో: కరోనా మహమ్మారి నుంచి జనాన్ని రక్షించడానికి మార్కెటింగ్‌శాఖ  ఉన్నతాధికారులు కొత్తపేట ఫ్రూట్‌ మార్కెట్‌ను మూడు ప్రాంతాలకు తరలించారు. మామిడి సీజన్‌తో పాటు రంజాన్‌ నెల నేపథ్యంలో పండ్లు కొనుగోలు చేయడానికి మార్కెట్‌కు వేల సంఖ్యలో జనం వస్తున్నారు. ఇక్కడ రద్దీని తగ్గించడంతో పాటు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా కమీషన్‌ ఏజెంట్లు ఫ్రూట్స్‌ను మూడు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని అధికారులు చెప్పారు. 

రాష్ట్రంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌...
కొత్తపేట మార్కెట్‌ తెలంగాణలోనే అతిపెద్ద ఫ్రూట్‌ మార్కెట్‌. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలు, ఆయా దేశాల నుంచి కూడా ఇక్కడికి పండ్లు రావడంతో గ్రేటర్‌ పరిధి నుంచే కాకుండా ఆయా జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలు వ్యాపారులు, రైతు లు ఈ మార్కెట్‌కు వస్తారు. దీంతో ఇక్కడ కరోనా వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్తగా మార్కెట్‌ను మూడు ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కొత్తపేట ఫ్రూట్‌ మార్కెట్‌లో మామిడి బత్తాయి, సరూనగర్‌ రైతు బజార్‌ వెనుక వైపు టెలిఫోన్‌ కాలనీ వెళ్లే మార్గంలో ద్రాక్ష, ఆరెంజ్, సపోటా, ఉప్పల్‌ భగాయత్‌ మార్కెట్‌లో బప్పాయి, వాటర్‌ మిలన్‌తో పాటు ఇతర పండ్లు విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో దాదాపు వారం రోజులుగా మూడు ప్రాంతాల్లో మార్కెట్‌ కొనసాగుతోంది. ఈ విషయాన్ని పండ్ల వ్యాపారులు గ్రహించాలని అధికారులు తెలిపారు. 

అధిక పని భారం..
మార్కెట్‌ మూడు ప్రాంతాల్లో ఉండటంతో యార్డు ఇన్‌చార్జ్‌లకు కష్టమవుతోంది. గతంలో కొత్తపేటలోనే అన్ని పండ్ల విక్రయాలు జరిగేవి. మొత్తం మా ర్కెట్‌ను ఉన్నత అధికారులు మూడు భాగాలుగా విభజించి సూపర్‌వైజర్లకు డ్యూటీలు వేసేవా రు. ప్రస్తుతం ఒక్కో మార్కెట్‌కు ఇద్దరు సూపర్‌వైజర్లతో పాటు ఇతర సిబ్బంది నియమించాల్సి వస్తోంది. దీంతో అధికారులు, సిబ్బందిపై అధిక పనిభారం పడటంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు.

వైరస్‌ వ్యాప్తి అరికట్టేందుకే...  
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకే మార్కెట్‌ను మూడు ప్రాంతాలకు అధికారులు తరలించారు. అయినా రద్దీ కాస్త ఎక్కువగానే ఉంది. ప్రత్యేకంగా కొత్తపేట మార్కెట్‌లో మామిడి దిగుమతులు ఎక్కువ ఉండటంతో జనం ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. మార్కెట్‌లో శానిటేషన్‌తో పాటు భౌతికదూరం పాటించాలనిజీహెచ్‌ఎంసీతో పాటు మార్కెట్‌ సిబ్బంది, పోలీసులు రైతులకు, వ్యాపారులకు అవగాహనకల్పిస్తున్నారు. మార్కెట్లో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశాం. మూడు మార్కెట్లను పర్యవేక్షిస్తున్నాం. – వెంకటేషం,గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement