రూ.1,500 కోట్లతో సింగరేణి అభివృద్ధి | KCR Wants Comprehensive Plan for Infra Development in Singareni | Sakshi
Sakshi News home page

రూ.1,500 కోట్లతో సింగరేణి అభివృద్ధి

Apr 11 2018 1:22 AM | Updated on Sep 2 2018 4:16 PM

KCR Wants Comprehensive Plan for Infra Development in Singareni - Sakshi

మంగళవారం ప్రగతిభవన్‌లో సింగరేణి అభివృద్ధిపై సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో స్పీకర్‌ మధుసూదనాచారి, నర్సింగ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అందుబాటులో ఉన్న రూ.1,500 కోట్ల ‘డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ ట్రస్టు (డీఎంఎఫ్‌టీ)’నిధులతోపాటు ఇతర నిధులు కలిపి రహదారుల నిర్మాణం, ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో సమీ క్షించారు. సింగరేణి  ఖనిజ సంపద జాతి అభివృద్ధికి దోహదపడుతుందని.. కానీ బొగ్గు గనులున్న ప్రాంతాలు ఛిద్రమైపోతున్నాయని, రోడ్లు పాడవుతున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. బొగ్గు గనులున్న ప్రాంతాలతోపాటు బొగ్గు తరలించే మార్గాల్లోని రోడ్లు దెబ్బతింటున్నాయని, దుమ్ముతో జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అందువల్ల ఆయా ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలని అన్నారు. 

నిధులన్నింటినీ సమీకరించి.. 
సింగరేణి గనులున్న గ్రామాలన్నీ మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలేనని.. వాటిపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘సింగరేణి బొగ్గు ద్వారా వచ్చిన ఆదాయం నుంచి సమకూరిన డీఎంఎఫ్‌టీ నిధులతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులు,  ఇరిగేషన్‌ నిధులు, రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా సమకూరే నిధులను అనుసంధానం చేసుకుని సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. ఏ ప్రాంతంలో ఏ అవసరం ఉందో గుర్తించి, దాని ప్రకారం పనులు చేపట్టాలి. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు కలసి పనులను నిర్ధారించి, నిధులు విడుదల చేయాలి. ఈ నిధులతో చేపట్టే పనులను కలెక్టర్లు పర్యవేక్షించాలి..’’అని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో.. కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలను కొత్త జిల్లాలుగా చేసుకున్నామని.. ఈ జిల్లా కేంద్రాల్లోనూ అభివృద్ధి పనులు జరగాలని చెప్పారు. 

హామీలన్నీ నెరవేర్చాలి.. 
సింగరేణి ఎన్నికలతోపాటు ఇటీవల సింగరేణి పర్యటన సందర్భంగా కార్మికులకు ఇచ్చిన   హామీలన్నీ నూటికి నూరుశాతం అమలు కావాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు సీఎం ఇచ్చిన 17 హామీలను నెరవేర్చే దిశగా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. 

సీఎండీకి, కార్మికులకు కేసీఆర్‌ అభినందనలు 
2017–18 సంవత్సరంలో 6.2 శాతం వృద్ధిరేటుతో రికార్డు స్థాయిలో 646 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సింగరేణి సీఎండీ శ్రీధర్, కార్మికులను అభినందించారు. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో 91.1 శాతం పీఎల్‌ఎఫ్‌తో విద్యుదుత్పత్తి జరగడంపైనా సంతోషం వ్యక్తం చేశారు. సమీక్షలో శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, జలగం వెంకట్రావు, కోవ లక్ష్మి, పుట్టా మధు, పాయం వెంకటేశ్వర్లు, దివాకర్‌ రావు, కోరం కనకయ్య, మనోహర్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement