ప్రియాంక హత్యపై స్పందించిన సీఎం కేసీఆర్‌

KCR Response Over Priyanka Murder Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్‌.. ఈ కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని సీఎం అధికారులను కోరారు. ఇటీవల వరంగల్‌లో ఓ మైనర్‌ బాలిక హత్య విషయంలో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడిందని గుర్తుచేశారు. అదే తరహాలో ఈ కేసులో కూడా సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రియాంకారెడ్డి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

మరోవైపు ఆర్టీసీ కార్మికులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో కేసీఆర్‌ ప్రియాంకారెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి ఆవేదన చెందారు. ఇది అమానుషమైన దుర్ఘటన అని అన్నారు. ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఆర్టీసీలో మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటలలోపు విధులు పూర్తయ్యేలా డ్యూటీలు ఉండాలని అధికారులను ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top