గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ 

KCR Invites Governor Narasimhan To Kaleshwaram Inauguration - Sakshi

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం 

కార్యక్రమ వివరాలు వెల్లడించిన ముఖ్యమంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 21న తలపెట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు పలు ఇతర అంశాలపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రణాళికను గవర్నర్‌కు వివరించారు.

కార్యక్రమంలో భాగంగా ఈనెల 21న ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హోమం నిర్వహిస్తున్నామని, ఆ తర్వాత ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గవర్నర్‌తో సహా ఇతర ప్రముఖులను హైదరాబాద్‌ నుంచి అక్కడకు తీసుకెళ్లడానికి నాలుగు హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏపీ, మహారాష్ట్ర రాష్ట్రాల సీఎంలు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవిస్‌లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 2020తో పూర్తికానుందని, 45 లక్షల ఎకరాలకు 2 పంటలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మంగళవారం జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశం విశేషాలను కూడా గవర్నర్‌కు తెలియజేశారు.

ఈ నెల 27న కొత్త సచివాలయం, కొత్త శాసనసభ, శాసనమండలి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుత సచివాలయం ఉన్న చోటే కొత్త సచివాలయాన్ని, ఎర్రమంజిల్‌లో కొత్త శాసనసభ భవనాన్ని నిర్మించనున్నట్టు వెల్లడించారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటున్నామని వివరించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు హైదరాబాద్‌లో సమావేశమై గోదావరి జలాల అంశంపై చర్చలు జరపనున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కోసం కేటాయించిన భవనాలను తెలంగాణకు సత్వరమే అప్పగించడం పట్ల సీఎం కేసీఆర్‌ సంతోషం వ్యక్తంచేశారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top