మా గ్రామాలను తెలంగాణలో కలపండి  | KCR Hints At TRS Contesting Maharashtra Assembly | Sakshi
Sakshi News home page

మా గ్రామాలను తెలంగాణలో కలపండి 

Sep 18 2019 3:06 AM | Updated on Sep 18 2019 5:02 AM

KCR Hints At TRS Contesting Maharashtra Assembly - Sakshi

సీఎం కేసీఆర్‌ను కలిసిన మహారాష్ట్రలోని నాందేడ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్‌గావ్‌ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేకపోతే తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు తెలిపి, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. తాము టీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ చేసేందుకు క కూడా సిద్ధమని ప్రకటించారు. నాందేడ్‌ జిల్లాలోని నయ్‌గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్‌గావ్‌ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు బాబ్లీ సర్పంచ్‌ బాబురావు గణపతిరావు కదమ్‌ నేతృత్వంలో మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ‘మా గ్రామాలన్నీ తెలంగాణ గ్రామాలకు ఆనుకునే ఉన్నాయి. కానీ మా గ్రామాల పరిస్థితి, తెలంగాణ గ్రామాల పరిస్థితి చాలా భిన్నంగా ఉన్నాయి.

తెలంగాణలో రైతులు, పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. మేమంతా బాధల్లో ఉన్నాం. తెలంగాణలో రైతులకు రైతుబంధు సాయం అందుతోంది. మా గ్రామాల్లో రైతులకు ఇలాంటి సాయమేదీ లేదు. తెలంగాణలో రైతుబీమా అమలవుతోంది. మహారాష్ట్రలో లేదు. తెలంగాణ లో పేదలకు 2 వేల రూపాయల పెన్షన్‌ వస్తోంది. మా రాష్ట్రంలో రూ.600 మాత్రమే వస్తోంది. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా అం దుతోంది. మా దగ్గర 8 గంటలు ఇస్తామని చెప్పి, ఆరు గంటలే ఇస్తున్నారు. తెలంగాణ, మహా రాష్ట్ర గ్రామాల మధ్య వివాహ సంబంధాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్‌ కిట్స్, కల్యాణ లక్ష్మీ, పండుగలకు దుస్తుల పంపిణీ లాంటి పథకాలు మహిళలను ఎంతో ఆదుకుంటున్నాయి. మహారాష్ట్రలో ఇలాంటి పథకాలు లేవు’అని వివరించారు. ‘సాగునీటి విషయంలో కూడా మా పరిస్థితి ఘోరంగా ఉంది’అని పేర్కొన్నారు. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని గతంలో ధర్మాబాద్‌ నియోజకవర్గానికి చెందిన 40 గ్రామాల ప్రజలు తీర్మానం చేసినట్లు తెలిపారు. 

త్వరలో నిర్ణయం: సీఎం కేసీఆర్‌ 
నాందేడ్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ప్రజలతోపాటు భివండి, షోలాపూర్, రజూర  ప్రాంతాల నుంచి కూడా టీఆర్‌ఎస్‌ టికెట్‌ కావాలని అడుగుతున్నారని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.  

అప్పుడు హైదరాబాద్‌లోనే.. 
నిజాం కాలంలో తామంతా హైదరాబాద్‌ రాజ్యంతోనే ఉన్నామని, ఇప్పటికీ నిజాం ఖాస్రాపహాణీలతోనే భూ రికార్డులు సరిచూసుకుంటున్నామని, తమ గ్రామాల్లోనూ బతుకమ్మ, బోనా ల పండుగ నిర్వహిస్తామని నేతలు వెల్లడించారు.  త్వరలోనే కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ తదితర పారీ్టలకు చెందిన స్థానిక నేతలతో వచ్చి కేసీఆర్‌ను కలుస్తామని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement