సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరంతో గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు తరలించి నీటి లభ్యతను పెంచే కొత్త ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ ప్రాణం పోశారు. కాళేశ్వరంలో భాగం గా నిర్మించే బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి గోదా వరి జలాలను సాగర్ ఆయకట్టు పరీవాహకానికి తరలించి నీటి లభ్యతను పెంచడం, ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యం గా అధ్యయనం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ దిశగా అప్పుడే కసరత్తు మొదలైంది.  
3.50లక్షల ఎకరాల స్థిరీకరణ.. 
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రస్తుతం రెండు టీఎంసీల సామర్థ్యంతో చేపట్టగా, ఇందులో మిడ్‌మానేరు దిగువన ఒక టీఎంసీ, ఎస్సారెస్పీ పునరుజ్జీవానికి మరో టీఎంసీ తరలించేలా ప్రస్తుతం పనులు పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లాలో ప్రతిపాదించిన బస్వాపూర్ వరకు నిర్ణయించిన ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు సింగూరు, నిజాంసాగర్ వరకు మరింత నీటిని అందుబాటులో ఉంచేందుకు అదనంగా మరో టీఎంసీ నీటిని తీసుకోవాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ అదనపు టీఎంసీతో నీటి లభ్యత పెరుగుతున్నందున బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని నాగార్జునసాగర్ ఆయకట్టుకు తరలించేలా చూడాలని ఆయన ఆదేశించగా రిటైర్డ్ ఇంజనీర్లు ప్రాథమిక సూచనలు చేశారు.
బస్వాపూర్ నుంచి 3 కిలోమీటర్ల కాల్వ తవ్వకం ద్వారా నీటిని శామీర్‌పేట వాగుకు తరలించవచ్చని, కనిష్టంగా 4వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా కాల్వను వెడల్పు చేసుకుంటే సరిపోతుందని సూచించారు. అక్కడి నుంచి మూసీ నది, ఆసిఫ్ నహర్‌కు నీటిని తరలించాలని, ఉదయ సముద్రాన్ని బైపాస్ చేసి పానగల్ వాగులో కలపాలని తేల్చారు. అక్కడి నుంచి నేరుగా పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తే, అక్కడి నుంచి సాగర్ కింద ఉన్న 3.70 లక్షల ఎకరాల ఆయకట్టులో కనిష్టంగా 3.50లక్షల ఎకరాలకు నీరందించి స్థిరీకరించవచ్చని తేల్చారు.
రేపు పర్యటించనున్న రిటైర్డ్ ఇంజనీర్లు 
కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేని సమయంలో ఈ విధంగా గోదావరి నీటిని నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించేలా సమగ్ర అధ్యయనం చేసి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం సూచించారు. దీనిపై రిటైర్డ్ ఇంజనీర్లు మంగళవారం నుంచి అధ్యయనం మొదలుపెట్టనున్నారు. ఇక దీనితో పాటు సాగర్ ఆయకట్టు పరిధిలో కొత్తగా ఎత్తిపోతల పథకాలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేల నుంచి డిమాండ్ వస్తోంది.ఇప్పటికే వరల్డ్‌బ్యాంకు నిధులతో సాగర్ కాల్వల ఆధునికీకరణ చేసిన నేపథ్యంలో కొత్తగా ఎత్తిపోతల పథకాలు అవసరమన్న విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్ల బృందం సాగర్ పరీవాహకంలో పర్యటించి అధ్యయనం చేయనుంది. వీటితో పాటే ఎస్సారెస్పీ పరిధిలోనూ కొత్త ఎత్తిపోతల పథకాలు అవసరమా? లేదా? అన్నది తేల్చనుంది.   

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
