
సాక్షి, హైదరాబాద్: తాము తెలంగాణ ప్రజలకే ఏజెంట్లం తప్ప, ఎవరితోనూ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదేళ్లు బీజేపీతోనూ, ప్రధాని నరేంద్ర మోదీతోనూ కేసీఆర్‌కి ఉన్న రహస్య అవగాహన గురించి తెలంగాణ ప్రజలకు బాగా అవగాహన వచ్చిందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఆడిన నాటకం కూడా వారికి అర్ధమైందన్నారు.
నరేంద్రమోదీని ఇప్పడు ఎన్నికల సందర్భంగా తెగ తిడుతున్న కేసీఆర్... గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలపై నోరు మెదిపేందుకు కూడా ఎందుకు సాహసించలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మోదీతో బంధాన్ని బయటపెడితే తెలంగాణ సీఎంకు ఎక్కడ లేని కోపం వస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు ఏజెంట్లుగా పనిచేస్తామని చెబుతున్న కేసీఆర్, రాష్ట్రంలోని 14 మంది ఎంపీల మద్దతున్నా, కనీసం విభజన హామీలను సాధించడంలో ఎందుకు విఫలమయ్యారో వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.