
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మంత్రులంతా తమ జిల్లాలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. అధికారులు స్థానికంగానే ఉండి, అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని ఆదేశించారు. మంత్రులు జిల్లాల్లో అందుబాటులో ఉండాల్సి ఉన్నందున సోమవారం జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.