రూపాయికే అంత్యక్రియలు

Karimnagar Mayor Funerals Available - Sakshi

కరీంనగర్‌కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక్క రూపాయికే అంత్యక్రియలు–ఆఖిరిసఫర్‌ కార్యక్రమం శనివారం నుంచి అమల్లోకి రానుంది. నగరంలో నివసించే నిరుపేదలకు వరంగా మారే ఈ పథకాన్ని నగర మేయర్‌ రవీందర్‌సింగ్‌ రూపొందించారు. మున్సిపాలిటీ అంటే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా నిరుపేదలకు ఇబ్బందికరంగా మారిన అంతిమ సంస్కారాలను చేయాలనే తలంపుతో పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అన్ని కులాలు, మతాల వారికి అంతిమయాత్ర నుంచి మొదలుకొని అంత్యక్రియల వరకు అయ్యే ఖర్చులను నగరపాలక సంస్థనే భరించనుంది. పథకం అమలుకు కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తున్నారు.

ఇందుకోసం రూ.48 లక్షలు కేటాయించి టెండర్లు కూడా పిలిచారు. అధికారులు, ఉద్యోగులతో ప్రత్యేక కమిటీ వేసి పర్యవేక్షించనున్నారు. ఒక్క రూపాయి బల్దియాకు చెల్లిస్తే చాలు కార్మికులను వారి ఇంటికి పంపించి పాడె కట్టించడంతోపాటు నలుగురు డప్పు వాయించే వారిని పంపిస్తుంది. మృతుల కుటుంబ సభ్యులు కోరితే ఉచితంగానే బాడీ ఫ్రీజర్‌ను అందిస్తారు. మృతదేహాన్ని శ్మశానవాటికకు పంపించేం దుకు వాహనాన్ని సమకూరుస్తారు. అంత్యక్రియల సందర్భంగా ఎవరి సంప్రదాయాల ప్రకారం వారికి అవసరమైన సామగ్రిని అందజేస్తారు. శ్మశానవాటికలో దహన సంస్కారాలు చేసే వారికి కట్టెలు, కిరోసిన్, టైర్లు, ఇతర వసతులు కల్పిస్తారు. మృతదేహాన్ని ఖననం చేసే సంప్రదాయం ఉంటే ఆ ప్రకారంగా ఏర్పాట్లు చేస్తారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అక్కడికక్కడే డెత్‌ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తారు.

నిరుపేదలకు అండగా...
రెక్కాడితే డొక్కాడని కుటుంబాల్లో ఏ రోజు కూలీ చేసుకుంటే ఆ రోజు గడిచే పరిస్థితి ఉంటుంది. అలాంటి కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల ఖర్చులు వారికి తలకుమించిన భారమే. అలాంటి కుటుంబాల్లో చాలా సందర్భాల్లో స్థానికులు చందాలు వేసుకొని అంతిమ సంస్కారాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అంతిమయాత్ర–ఆఖిరిసఫర్‌ కార్యక్రమంలో నిరుపేదలకు అండగా మారనుంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలకు అంత్యక్రియలు భారం కాకుండా ఉండేందుకు నగరపాలక సంస్థ తీసుకున్న ఈ పథకంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. నిరుపేదలకు అండగా చేపట్టిన పథకం అన్ని ప్రాంతాల్లో విస్తరించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సైతం యోచిస్తోంది.

సామాజిక దైవకార్యంలా భావించాలి.. – మేయర్, కమిషనర్‌
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే అంతిమాయాత్ర–ఆఖిరిసఫర్‌ కార్యక్రమాన్ని సామాజిక దైవకార్యంగా భావించి, ఈ కార్యక్రమ అమలుకు అధికారులంతా సిద్ధం కావాలని నగర మేయర్‌ రవీందర్‌సింగ్, కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కోర్టు ట్యాంకు ఆవరణలో పథకం అమలుపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. పథకానికి నగర మేయర్‌ రవీందర్‌సింగ్‌ రూ.50 వేలు విరాళంగా ప్రకటించారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న పథకం అమలుపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా మేయర్, కమిషనర్‌ మాట్లాడుతూ.. పథకం అమలుకు రూ.49 లక్షలు కేటాయించామని, ఒక్క అంత్యక్రియ కార్యక్రమానికి సుమారు రూ.6వేలు నగరపాలక సంస్థ ద్వారా ఖర్చు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి డీఈ స్థాయి వ్యక్తిని ప్రత్యేక అధికారిగా నియమించి, స్పెషల్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఏరియాల వారీగా కమిటీ అధికారులు ఆఖిరి సఫర్‌ కార్యక్రమం విధుల నిర్వహిస్తారన్నారు. యుద్ధప్రాతిపదికన పథకం అమలుకు నగరపాలక సంస్థ సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ భద్రయ్య, డిప్యూటీ కమిషనర్‌ స్వరూపరాణి, అదనపు కమిషనర్‌ రాజేంద్రకుమార్, డీఈలు రామన్, యాదగిరి, మసూద్, ఏఈలు వెంకట్‌కుమార్, చైతన్య, నిఖిత, వాణి, సానిటరీ సూపర్‌వైజర్‌ వేణుగోపాల్, ఇన్స్‌పెక్టర్లు, జవాన్లు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top