15 నుంచి కంటి వెలుగు  

Kanti Velugu From 15th - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి కంటి వెలుగు ప్రారంభం కానుందని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రిన్సిపల్‌ కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆమె హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ కంటి వెలుగుకు కావాల్సిన మెటీరియల్‌ సరఫరా, క్యాంప్‌ల నిర్వహణ, టీంల ఏర్పాటు, అవసరమైన శిక్షణ వంటి అంశాలపై సమీక్షించారు.

కమిషనర్‌ వాకాటి కరుణ మాట్లాడుతూ వైద్య సిబ్బంది, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ మాట్లాడుతూ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించి, వారితో సమావేశం నిర్వహించి అవసరమైన సూచనలు చేయనున్నట్లు వివరించారు. జిల్లాకు పెషేంట్‌ కార్డులు 7 లక్షల వరకు అవసరం ఉంటుందని, వాటిని సరఫరా చేయాలని కోరారు.

ఉట్నూర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్, ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు కావాల్సిన ఎక్విప్‌మెంట్లు సరఫరా చేయాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం వైద్యాధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్‌ సమీక్షించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలోని పట్టణ టీంలకు, మధ్యాహ్నం 3.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో గ్రామీణ ప్రాంత టీంలకు సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని 509 రెవెన్యూ గ్రామాల్లో క్యాంప్‌లు నిర్వహించాలని, క్యాంప్‌కు హాజరయ్యే పెషంట్‌ తన ఆధార్‌ కార్డు తీసుకొని రావాలని అన్నారు.

ఆయా ఎంపీడీవోలు మెడికల్‌ అధికారులకు సహకరించాలని చెప్పారు. ఐకేపీ సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని, క్యాంప్‌లు నిర్వహించే తేదీ, రోజును గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సంధ్యారాణి, ఆర్డీవో సూర్యనారాయణ, డీఆర్డీవో రాజేశ్వర్, డీఎంహెచ్‌వో రాజీవ్‌రాజ్, డాక్టర్లు చంపత్‌రావు, చందు, మెడికల్‌ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top