వి'జయ' గాథ

Kamareddy district DPO Jayasudha Success Story - Sakshi

విధిరాతను మార్చుకున్న జయసుధ

బాధలను దిగమింగి లక్ష్యం వైపు 

కఠోర శ్రమతో డీపీవోగా ఎంపిక  

ఆమె పశువైద్యురాలు.. భర్త ఎంబీబీఎస్‌ డాక్టర్‌.. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో ఓ యాక్సిడెంట్‌ చీకట్లు నింపింది. రోడ్డు ప్రమాదం లో భర్తను కోల్పోయిన ఆమె.. మానసికంగా కుంగిపోయి ఉద్యోగం చేయలేకపోయింది. ఆ తర్వాత గుండె దిటవు చేసుకుని ఉన్నత విద్యాభ్యా సం చేసింది. గ్రూప్స్‌ రాసి డీపీవోగా ఎంపికయ్యింది. ఇటీవలే కామారెడ్డి డీపీవోగా విధుల్లో చేరిన జయసుధ సక్సెస్‌ స్టోరీ..    

బాన్సువాడ: మాది బాన్సువాడ. నాన్న పెర్క రాజారాం పోస్ట్‌ మాస్టర్‌. అమ్మ సరోజ. మేము నలుగురం అక్కాచెల్లెళ్లం, ఇద్ద రు సోదరులు. నేను ఐదో సంతానం. మేమంతా ప్రభుత్వ పాఠశాలలోనే తెలుగు మీడియంలో చదివాం. ఐదో తరగతి వరకు బాన్సువాడలోనే చదివా. ఆరో తరగతిలో జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్ష రాసి ఎంపికయ్యా. అలా 6 నుంచి 12 వరకు నవోదయలో చదివా. ఆ తర్వాత డిగ్రీలో ఎనిమిల్‌ హస్బెండరీ అండర్‌ వెటర్నరీ సైన్స్‌ పూర్తి చేశా. 2002లో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌గా నాగిరెడ్డిపేట మండలంలో పోస్టింగ్‌ సాధించా. 2003లో మెదక్‌కు చెందిన ప్రభుత్వ వైద్యుడు కేశవ్‌తో వివాహం జరిగింది. ఉద్యోగం రావడం.. ఎంతో ప్రేమించే భర్త ఉండడంతో నేను ఎంతో సంబరపడ్డా.. అంతా సంతోషంగా సాగిపోతున్న తరుణంలో ఒక్కసారిగా ఊహించని షాక్‌ తగిలింది. డ్యూటీకి వెళ్లిన ఆయన యాక్సిడెంట్‌లో చనిపోయారు. పెళ్లయిన తొమ్మిది నెలలకే ఆయన నన్ను విడిచి వెళ్లిపోయారు. అంతా శూన్యమై పోయినట్లు అనిపించింది. మానసికంగా చాలా కుంగిపోయా. ఆ ఊరిలో ఉండి ఉద్యోగం చేయలేక పోయా. చివరకు ఎలాగోలా కోలుకున్నా. ఆ బాధను మరిచి పోయేందుకు చదువుకోవాలని నిర్ణయించుకున్నా. ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి హైదరాబాద్‌ వెళ్లిపోయా. వెటర్నరీ మైక్రోబయోలజీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశా.  

వెటర్నరీ బయాలజికల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో వెటర్నరీ మెడిసిన్స్‌ తయారీలో నిమగ్నమయ్యా. అలా ఏడేళ్లు గడిచి పోయాయి. 2010లో బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన నాగనాథ్‌ నా జీవితంలోకి వచ్చారు. ఆయన డిగ్రీ కళాశాల లెక్చరర్‌. హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం. ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా కాలం సాగిపోతోంది. అయితే, ప్రజా సంబంధాలు గల ఉద్యోగం చేస్తూ, ప్రజలకు సేవలందించాలనే తపన నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ లక్ష్యాన్ని చేరాలనుకున్నా. కష్టపడి చదివి 2011లో గ్రూప్స్‌ పరీక్ష రాశా. ఇంటర్వ్యూకూ సెలక్ట్‌ అయ్యా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పరీక్షలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రేయింబవళ్లు కష్టపడి చదివి ఇంటర్వ్యూకు ఎంపికైన తర్వాత ఇలా జరగడంతో మానసికంగా కుంగిపోయా. ఆ సమయంలో నాగ్‌నాథ్‌ నాకు ఎంతో ధైర్యం చెప్పారు. పరీక్షలకు మళ్లీ సిద్ధం కావాలని ప్రోత్సహించారు. ఆయనిచ్చిన ధైర్యంతో పరీక్షలకు మళ్లీ సన్నద్ధమయ్యా. రోజులో సగభాగం పుస్తకాలకే సమయం కేటాయించా. 2016లో గ్రూప్స్‌ పరీక్షలు రాశా. ఎట్టకేలకు అనుకున్నది సాధించా. సొంత జిల్లాలోనే డీపీవోగా ఉద్యోగం సాధించా.

జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా. పెళ్లయిన తొమ్మిది నెలలకే భర్త మృతితో కుంగిపోయా. ఎంతో కష్టపడి చదివి రాసిన పరీక్షలు రద్దవడంతో మరింత ఆందోళనకు గురయ్యాయి. కానీ, భర్త నాగ్‌నాథ్‌ ప్రోత్సాహంతో గ్రూప్స్‌పై పూర్తి దృష్టి సారించా. రోజూ 12–13 గంటలు చదివే దాన్ని. ఎట్టకేలకు అనుకున్నది సాధించా. మహిళలు ధైర్యంతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చు. అందుకు నా జీవితమే ఉదాహరణ.  

-జయసుద

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top