‘సోగ్గాడు’ తిరిగొస్తున్నాడు. శోభన్‌బాబు హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడు (1975)’. జయచిత్ర, జయ సుధ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కె. బాపయ్య దర్శకత్వంలో డి. రామానాయుడు నిర్మించారు. 1975 డిసెంబరు 19న ఈ సినిమా విడుదలైంది. ‘సోగ్గాడు’ చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లో స్వర్ణోత్సవం జరగనుంది.
అదే రోజు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను రీ రిలీజ్ చేయనుంది. ఆదివారం ‘సోగ్గాడు’ సినిమా స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్‌బాబు మాట్లాడుతూ – ‘‘సోగ్గాడు’ మా సంస్థకు మంచి పేరు, డబ్బు తెచ్చిపెట్టింది. నేటి టెక్నాలజీని ఉపయోగించి, ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నాం. అలాగే మా సంస్థ చిత్రాలను ఏఐలోకి మార్చే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నాం’’ అని చెప్పారు. మురళీ మోహన్ మాట్లాడుతూ– ‘‘శోభన్‌బాబుతో నేను ‘ముగ్గురు మిత్రులు’ సినిమా తీశాను’’ అని అన్నారు. ఇంకా పలువురు దర్శక–నిర్మాతలు, అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.


