
సహజ నటి జయసుధ హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘లక్ష్మణ రేఖ’కు 50 ఏళ్లు. ఈ సినిమాకి ముందు ఓ నాలుగైదు సినిమాల్లో ఆమె కీలక పాత్రలు చేశారు. ఎన్. గో పాలకృష్ణ దర్శకత్వంలో షణ్ముగం చెట్టియార్, ఏవీ కృష్ణారావు నిర్మించిన ‘లక్ష్మణ రేఖ’లో చేసిన సీరియస్ క్యారెక్టర్ జయసధకు మంచి పేరు తెచ్చిపెడితే, దర్శకుడు ఎన్. గో పాలకృష్ణకి ‘లక్ష్మణ రేఖ’ ఇంటి పేరుగా మారి పోయింది. ఈ చిత్రంలో మురళీమోహన్ – జయసుధ జంటగా నటించగా, చంద్రమోహన్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, గుమ్మడి, అల్లు రామలింగయ్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 1975 సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా విడుదలై 50 ఏళ్లయిన సందర్భంగా ‘సాక్షి’తో జయసుధ ప్రత్యేకంగా పంచుకున్న విషయాలు.
‘లక్షణ రేఖ’ ఓ మరాఠీ చిత్రానికి మూలం. తండ్రి చెప్పిన మాట వినకుండా ప్రేమికుడి కోసం ఇంటి నుంచి వెళ్లిన ఒక అమ్మాయి మోస పోతుంది. ఆ ప్రేమికుడిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఆ మోసగాడు ఆమె చెల్లెలి భర్తతో పరిచయం పెంచుకుని, వారి కాపురంలో చిచ్చుపెడతాడు. భర్త వదిలేస్తాడు. నేను చెల్లెలి పాత్ర చేశాను. ఇది బరువైన పాత్ర కాబట్టి నా వయసు సరి పోదని, నన్ను వద్దని డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌తో పెద్దలు చె΄్పారు. అయితే ఆ సినిమా నాకే వచ్చింది.
‘లక్ష్మణ రేఖ’ తర్వాత ‘జ్యోతి, ఆమె కథ, ప్రేమలేఖలు’ వంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నావి టఫ్ రోల్స్. అన్నిటికంటే కష్టమైనది ‘ఆమె కథ’. ఆ సినిమా ఇప్పుడు తీసినా ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. ఏ భాషలో అయినా పనికొస్తుంది. ఇంగ్లిష్‌లో కూడా తీయొచ్చు. అప్పటి ఆ టైమ్, ఆ సీజన్‌లో అన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే. ఆ సినిమాలకు ఒక అమ్మాయి దొరికింది...
ఆమె జయసుధ (నవ్వుతూ).
ఆ రోజుల్లో హీరోయిన్లను బాలీవుడ్ నుంచో వేరే ఉడ్ నుంచో తీసుకురావడం తక్కువ. తెలుగు లేదంటే తమిళ పరిశ్రమ నుంచే ఆర్టిస్టులు ఉండేవారు. దాంతో మాకు ఎక్కువ పాత్రలు వచ్చేవి. సీరియస్‌గా, మేకప్ లేకుండా, టైట్‌గా జెడ వేసుకుని, కాటన్ చీరలు కట్టుకుని... ఇలా పాత్రలకు తగ్గట్టుగా మౌల్డ్ అయ్యాను.
ఫిజిక్‌కి తగ్గ డ్రెస్ వేసుకునేవాళ్లం
అప్పట్లో మా ఫిజిక్‌కి తగ్గట్టు డ్రెస్ వేసుకునేవాళ్లం. ఆ రోజుల్లో 90 శాతం మంది డైరెక్టర్స్ మా డ్రెస్‌లు అభ్యంతరకరంగా ఉండకుండా జాగ్రత్త పడేవారు. నేను ట్రెడిషనల్ క్యారెక్టర్స్‌తో పాటు మోడ్రన్ క్యారెక్టర్స్ చేశాను. ‘నోము’ సినిమాలో అంత వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకున్నా అసభ్యంగా అనిపించలేదు. ‘యుగంధర్’ సినిమాలో అయితే స్విమ్ డ్రెస్ వేసుకున్నాను. అయితే అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది.
అయినా ఇండస్ట్రీ నన్ను దూరం పెట్టలేదు
కథ చెప్పేటప్పుడు నా పాత్ర ఒకలా చెప్పి, షూటింగ్‌కి వచ్చాక మారిస్తే ఒప్పుకునేదాన్ని కాదు. అప్పటికి నేను అప్‌కమింగ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ‘ఎందుకు ఇలా చేశారు?’ అని ప్రశ్నించేదాన్ని. నేను అడిగిన దాంట్లో న్యాయం ఉండేది కాబట్టి ఇండస్ట్రీ నన్ను దూరం పెట్టలేదు. మా నాన్న చాలా స్ట్రిక్ట్‌గా, అమ్మ కామ్‌గా ఉండేవారు. అయితే నచ్చక పోతే వీళ్లు సినిమా వదులుకుంటారని అందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఒక పద్ధతి ఉండేది... విలువలు ఉండేవి.
మహా నటి ఆమె ఒక్కరే...
‘సహజ నటి’ అనే టైటిల్ సూపర్ స్టార్ అని ఒక కార్యక్రమంలో నాకు మీడియా ఇచ్చింది. ఇప్పుడు పది లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేసి ఉండరు, అప్పుడే ‘మహా నటి’ అనేస్తారు. మహా నటి అనే బిరుదుకి అర్హత ఉన్న ఏకైక నటి సావిత్రిగారే. ఎన్నో గొప్ప పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిస్తే, ఆమెకు దక్కిన బిరుదు అది. ఇప్పుడున్నవారిని తక్కువ చేయడం లేదు. కానీ, కనీసం ఓ పాతిక లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశాక అలాంటి బిరుదులిస్తే బాగుంటుంది.
నా బయోపిక్‌కి ఓకే
నా బయోపిక్ ఎవరైనా తీస్తానంటే అభ్యంతరం లేదు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ విషయం గురించి నాతో చె΄్పారు. అయితే ముందుగా ఒక బుక్‌గా వస్తే బాగుంటుంది. నేనో 350 సినిమాలు చేశానంటే... వదులుకున్నవి ఓ 200 వరకూ ఉంటాయి. ఆ 350 సినిమాల్లో నా పాత్రల్లో నేను ఒదిగి పోవడానికి చేసిన కృషి గురించి తెలియాలి. అప్పటి స్టార్స్ గురించి ఈ జనరేషన్‌కి తెలియాలి. అది వారికి స్ఫూర్తిగా ఉంటుంది. ఒక చిన్న అమ్మాయిగా సినిమాల్లో మొదలైన నా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ జర్నీ తెలియాలి. వెబ్ సిరీస్‌గా అయితే బాగుంటుందనుకుంటున్నాను.
నా పరిచయ చిత్రం ఓ సంచలనం
హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా... అందులోనూ కొత్త డైరెక్టర్‌తో... లేని పోని రిస్క్ చేస్తున్నారని నిర్మాతల్ని భయపెట్టారు. జయసుధను ఎంపిక చేయడాన్ని పలు వురు పెద్దలు విమర్శించారు. కానీ నా మీద, నా సబ్జెక్ట్ మీద నమ్మకంతో నిర్మాతలు వెనకడుగు వేయలేదు. వాళ్లు చేసిన రిస్క్ ఫలించి, టేబుల్ ప్రాఫిట్‌గా ‘లక్ష్మణ రేఖ’ నిలిచి... నా ఇంటిపేరుగా మారింది. ఏరియాల వారిగా బిజినెస్ జరుపుకున్న తొలి చిత్రంగానూ దర్శకుడిగా నా పరిచయ చిత్రం చరిత్ర సృష్టించడం పట్ల ఇప్పటికీ గర్వపడుతుంటాను. – ఎన్. గో పాలకృష్ణ