15 డిసెంబర్ 1966
‘నా పాట పంచామృతం’ అన్న బాలు వాక్కులు నిజంగానే ‘బ్రాహ్మి’ (సరస్వతి) వాక్కులే!! నెల్లూరు జిల్లాలో కోనేటం పేటలో పుట్టిన ఈ బాలుడు పాటల కోనేటిరాయడై అఖిల భారతీయుల అభిమానాన్ని చూరగొంటాడని ఎవ్వరూ ఊహించలేదు. బాలు సైతం సినీ గాయకుడవుతానని కలలో కూడా ఊహించలేదు. ఆయనను ఇంజనీర్‌గా చూడాలనేది తండ్రి సాంబమూర్తి కల. కానీ ఆ కలకు భిన్నంగా బాలు తన ప్రతి భతో పాటల ఇంజనీరింగ్‌నే మార్చి ఆరు దశాబ్దాలు అప్రతిహతంగా సినీ సంగీత ప్రపంచానికి రారాజు అయ్యారు.
కలయా... నిజమా....
1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావులు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో బాలు ప్రతిభను మరో సంగీతదర్శకుడు ఎస్.పి. కోదండపాణి గమనించి, సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఆ మాటను నమ్మి బాలు కొన్నాళ్లు ఎదురు చూశారు. ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ప్రవేశించారు కానీ సినీరంగ ప్రవేశం మాత్రం జరగలేదు. బాలు కూడా క్రమంగా ఆ విషయం మరచిపోయారు.
ఓ రోజు కోదండపాణి హడావుడిగా వచ్చి, బాలు గది తలుపు తట్టి, ‘ఏమయ్యా పంతులూ... నీ అడ్రస్ ఇవ్వకపోతివి... చాలా కాలంగా నీ కోసం వెతుకుతున్నాను. ఇక్కడ ఉంటివా’ అని చీవాట్లు వేసి ‘పద్మనాభం ఓ సినిమా తీయబోతున్నారు. పాట పాడడానికి నీకు అవకాశమిస్తాను... ఎ.వి.ఎం స్టూడియోలో రికార్డింగ్ ఉంది’ అని చిరునామా వివరాలు ఇచ్చి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు. బాలుకు తల గిర్రున తిరిగింది... తనేంటి? కలయా... నిజమా అనుకున్నారు. అనుకున్న రోజు రానే వచ్చింది... తన ఫ్రెండ్ మురళితో కలిసి బాలు సైకిల్ పై ఎ.వి.ఎం. స్టూడియోకి వెళ్ళారు.
గేటు దగ్గరే నిలబెట్టేశాడు
గేట్‌మేన్ బాలును ఆపి లోనికి పోవడానికి వీల్లేదని, నీలాంటి వారు రోజూ ఇలాగే వస్తుంటారని అడ్డుకున్నాడు. గేటు దగ్గరే నిలబెట్టేశాడు. చివరికి కనీసం మురళినైనా లోపలికి పంపించి, కోదండపాణిగారికి తను వచ్చిన విషయం చెప్పండని, ఒకవేళ ఆయన రావద్దంటే తిరిగి వెళ్లిపోతామని బాలు అనగానే గేట్‌మేన్ అంగీకరించి, మురళిని అనుమతించగానే ఆయన వెళ్లి కోదండపాణికి విషయం చెప్పడం, ఆయన స్వయంగా గేటు వద్దకు వచ్చి గేట్ మేన్‌ను తిట్టి బాలును లోనికి తీసుకెళ్ళడం జరిగింది.
రావే కావ్య సుమబాల...
ఆ రోజు 15 డిసెంబర్ 1966... మధ్యాహ్నం 2.30 ని.లకు బాలు తొలిసారిగా తన గళం విప్పారు. నటుడు, నిర్మాత పద్మనాభం నిర్మించిన ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ చిత్రం అది. వీటూరి రాసిన ‘ఏమి ఈ వింతమోహం’ పాటను సుశీల, పీబీ శ్రీనివాస్, కె. రఘురామయ్య వంటి ఉద్దండ గాయకులతో కలిసి పాడారు. అది ఘంటసాల పాడాల్సిన వెర్షన్. ఆయన బదులు కొత్తవాడైన బాలు పాడ టం పద్మనాభానికి ఇష్టం లేదు. ఆ పాట కృష్ణ, శోభన్ బాబు, హరనాథ్, రామకృష్ణ, రాజశ్రీ వంటి తారలపై చిత్రించే మల్టీ స్టార్ సాంగ్ కావడం వలన ఆయన ఒప్పుకోలేదు.
ఘంటసాల అనారోగ్యం వలన బాలుతో పాడిస్తున్నానని, ఒకవేళ బాగా లేకుంటే మళ్ళీ ఘంటసాలతో పాడిద్దామని కోదండపాణి ఒప్పించి రికార్డింగ్ పూర్తి చేశారు. వందకు పైచిలుకు వాద్యకారులున్న ఆర్కెస్ట్రా అది. ఆరు నిమిషాల రాగమాలికైన ఆ పాటలో కల్యాణి రాగంలో కంపోజ్ చేసిన ‘రావే కావ్య సుమబాల’ అనే చరణాన్ని బాలు పాడారు. బాలు పాడిన చరణాన్ని తెరపై శోభన్‌బాబు అభినయించారు. మరునాడు ఘంటసాలను ఆహ్వానించి, ఆ పాటను వినిపించగానే, ఆ మహానుభావుడు ఎంతో ఆనందించారు.
అబ్బాయి బాగా పాడాడు...
‘అబ్బాయి బాగా పాడాడు... ఎవరినీ అనుకరించలేదు... ఎంతో సహజంగా పాడాడు... ప్రతి సంగతిని చక్కగా వేశాడు. నేను పాడక్కరలేదు... ఈ పాటను ఇలాగే ఉంచండి..’ అని చెప్పి కొత్త గొంతును పరిచయం చేసినందుకు అభినందించారు. ఘంటసాల మాటలకు పద్మనాభం ఎంతో సంతోషించి, బాలుకు అదే చిత్రంలో మరో పాటను, పద్యాన్ని పాడడానికి అవకాశం ఇవ్వడం విశేషం.
ఘంటసాలకు సిసలైన వారసుడు
బాలు పాడిన మొదటి పాట రికార్డుని తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులకు వినిపించి, అవకాశాలు ఇప్పించేవారు కోదండపాణి. తొలి పాట పాడాక బాలుకు వెంటనే రెండవ చిత్రంలో అవకాశం ఇచ్చారు ఎం.ఎస్. రెడ్డి. ఆయన ‘కాలచక్రం’ అనే తమిళ డబ్బింగ్ సినిమాలో పాడించారు. 1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి.
చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా పాటలు పాడి ప్రాణం పోశారు బాలు. అందుకే అమర గాయకుడు ఘంటసాల ‘తన తరువాత బాలు మాత్రమే తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడు’ అని చెప్పిన జోస్యాన్ని బాలు నిజంగానే నిరూపించుకున్నారు. ఘంటసాల తెలుగు మినహా వేరే భాషల్లో పాడలేదు. బాలు దేశంలోని దాదాపు భాషలలో పాడి, లక్షలాది అభిమానులను సంపాదించుకొన్నారు.
శంకరాభరణంతో...
బాలు 1966 నుండి సినిమాలలో పాడుతున్నప్పటికీ ఆయన శాస్త్రీయ గీతాలను సైతం సశాస్త్రీయంగా పాడగలరని నిరూపించిన చిత్రం ‘శంకరాభరణం’ (1980). దానికి ముందు ఘంటసాల జీవించిన కాలంలో బాలుకు ఎక్కువ శాతం రొమాంటిక్ పాటలు పాడడానికే ఆహ్వానాలు అందేవి. అయితే కోదండపాణి తరువాత బాలులోని ప్రతిభను గుర్తించిన సంగీత దర్శకులలో సత్యం ఒకరు. హరనాథ్ హీరోగా నటించిన ‘ప్రతీకారం’ (1970) చిత్రంలో ‘నారీ రస మాధురి లహరి’ అనే పాటను సత్యం హంసానంది రాగంలో స్వరపరచి బాలుతో పాడించిన తొలి లలిత శాస్త్రీయ గీతం. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ పాట కూడా ఎవరికీ అంతగా తెలియదు.
స్వర పారిజాతం
‘కన్నె వయసు’ (1973)లో ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాటను బాలుతో పాడించారు సత్యం. ఆ పాట క్లాసిజానికి మురిసిన జానకి తనతో కూడా పాడించాలని పట్టు పట్టడంతో ఆమెతో కూడా పాడించారు. జానకి అంచనా నిజమైంది... ఆ పాట బాలుకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి, ఆయనను నిజంగా ఈ భువిలో విరిసిన స్వర పారిజాతంగా మలచింది... ఘంటసాల మరణించాక (1974) గాయకునిగా బాలు విశ్వరూపమే ప్రదర్శించారు.
రోజుకి పదహారు పాటలు...
‘శంకరాభరణం, సాగర సంగమం’ లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ‘ఏక్ దూజే కే లియే’ లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. ‘త్యాగయ్య, అన్నమయ్య, సంగీత సామ్రాట్, భైరవ ద్వీపం’ చిత్రాలలో బాలు శాస్త్రీయ సంగీతంలో పాడిన పాటలే విమర్శకుల నోళ్ళు మూయించాయి... ఓ దశలో రోజుకు 16 పాటలు మూడు షిఫ్టులలో పాడి, బాలు తన అసమాన ప్రతిభను నిరూపించుకున్నారు.
అరుదైన రికార్డు
అలనాటి రాజేశ్వర రావు మొదలు ఆధునిక యువ సంగీత దర్శకులందరికీ బాలు ఒక ఫేవరెట్ సింగర్. బాలు తన మిమిక్రీ కళతో రాజ్ బాబు, పద్మనాభం, మాడా, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, నూతన ప్రసాద్, ఎ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్, కమల్‌హాసన్ తదితరుల నటుల గొంతుకలకు అతి సన్నిహితంగా పాడి భళా అనిపించుకున్నారు.
50 ఏళ్ళకు పై సినీ ప్రస్థానంలో 40 వేల పాటలకు పైగా 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి, ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా బాలు పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు. ఆయనతో కలిసి ఆయన సమక్షంలో అనేక కార్యక్రమాల్లో పాటలు పాడిన అదృష్టం ఈ వ్యాస రచయితకు కూడా ఉన్నది.
ఆ స్వరాలు అజరామరం
బాలు 1993 ఫిబ్రవరి 14న లలిత కళాతోరణంలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్టించారు. తరువాత 2003లో రవీంద్ర భారతి ప్రాంగణాన ఘంటసాల విగ్రహం స్థాపించడానికి మూల కారణమైన బాలు... ఆ మహనీయునితో కలిసి పాడుతానని కానీ మరణించిన తరువాత ఆయన విగ్రహం చెంతనే తన ప్రతిమ ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. తెలుగు సినీ కళామ తల్లికి ఘంటసాల, బాలు రెండు కళ్ళ వంటివారు. వారు దివంగతులైనా ఆ స్వరాలు అజరామరం.
– డా. వి.వి. రామారావు
రచయిత, గాయకుడు, ఆకాశవాణి వ్యాఖ్యాత


