ఫలించిన భగీరథ యత్నం

 Kaleshwaram Project launched Chief Guests  Of AP, MR CMs  - Sakshi

మహా అద్భుతం ఆవిష్కృతం సాగునీటి చరిత్రలో మొదలైన సరికొత్త అధ్యాయం

అంగరంగ వైభవంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం

విశిష్ట అతిథిగా పాల్గొన్న గవర్నర్‌ నరసింహన్‌

అతిథులుగా హాజరైన ఏపీ, మహారాష్ట్ర సీఎంలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఫడ్నవీస్‌

కన్నెపల్లిలో మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేసి ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

సాక్షి, వరంగల్‌ : సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో శుక్రవారం సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది... తరతరాలుగా తెలంగాణ ప్రజలు కంటున్న కల సాకారమైంది... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు  ప్రారంభం కావడంతో అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది.. విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్, ముఖ్యఅతిథులుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్‌ పాల్గొనగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మేడిగడ్డ ఆనకట్టను ప్రారంభించిన అనంతరం గోదావరి మాతకు పూజలు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్ర పుటల్లోకెక్కింది. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునే దిశగా చేపట్టిన ప్రయత్నం సక్సెస్‌ కావడంతో గోదారమ్మే మురిసిపోయింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో ఇంజినీర్లు చేసిన భగీరథ యత్నం ఫలించినట్లయింది. నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజినీరింగ్‌ అద్భుతంగా ఈ ప్రాజెక్టును వర్ణించాల్సి ఉండగా.. ఇంత భారీ, ఖరీదైన సాగునీటి ప్రాజెక్టు మరొటి లేక పోవడం.. ఎత్తిపోతల పథకాల్లోనే ప్రపంచంలో అరుదైనదిగా గుర్తింపు సాధించడం విశేషం. ప్రాజెక్టు కోసం భూమి మీద సాగిన నిర్మాణాలు... భూగర్భంలో అంతస్తుల లోతులో నిర్మించిన మహా బాహుబలి పంప్‌హౌస్‌లు... కిలోమీటర్ల కొద్దీ సాగిన అండర్‌ టన్నెల్‌ (సొరంగాలు) అందరి దృష్టికి ఆకర్షిస్తుండగా.. గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం కానుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న వేళ ఉమ్మడి వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఊరూవాడ సంబరాలు జరుపుకున్నారు. గ్రామాల్లో బాణసంచా పేల్చి.. మిఠాయిలు పంచుకున్నారు.  

అద్భుత ఘట్టం...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును శుక్రవారం ఉదయం గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌.నరసింహన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు అతిరథ మహారథుల సమక్షంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రారంభించారు. గవర్నర్, పొరుగు రాష్ట్రాల సీఎంలతో పాటు తెలంగాణ మంత్రులు వివిధ బ్యారేజీలు, పంపుహౌస్‌లను ప్రారంభించారు. తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంలో భాగంగా సరిగ్గా ఉదయం 11.23 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఇక 11.26 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.07 గంటలకు కన్నెపల్లి పంప్‌ హౌస్‌లో మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేశారు.

అనంతరం సరిగ్గా ఎనిమిది నిమిషాలకు అంటే మధ్యాహ్నం 1.15 గంటల నుండి పంప్‌ హౌస్‌ నుంచి నీటి పంపింగ్‌ ప్రారంభమయింది. దీంతో పవిత్ర గోదావరి జలాలను తెలంగాణలోని బీడు భూములకు మళ్లించే భగీరథ ప్రయత్నమైన బృహత్తర కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉపయోగంలోకి వచ్చినట్లయింది. అంతకుముందు మేడిగడ్డ బ్యారేజీ వద్ద, కన్నెపల్లి పంప్‌ హౌజ్‌ వద్ద శృంగేరి పీఠం అర్చకులు మణిశశాంక్‌ శర్మ, గోపీకష్ణ శర్మ ఆధ్వర్యంలో 40మంది వేదపండితులు జలాశయ ప్రతిష్టాంగ యాగం, జలసంకల్ప మహోత్సవ యాగం నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీసమేతంగా పాల్గొన్న ఈ యాగం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా వేద పండితులు ముగ్గురు ముఖ్యమంత్రులు, గవర్నర్‌ను ఆశీర్వందించారు. 

ఎవరెరు పాల్గొన్నారంటే..
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, వేముల ప్రశాంత్‌  రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కే.జోషి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, మహారాష్ట్ర డీజీపీ జైస్వాల్, ఎంపీలు జోగినిపల్లి సంతోష్‌ కుమార్, బి.వెంకటేష్‌ నేత, విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, కరీంనగర్‌ జెడ్పీ చైర్‌ పర్సన్‌ తుల ఉమ, మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, హరే రాం, వెంకటేశ్వర్లు, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావు, ట్రాన్స్‌కో డైరెక్టర్‌ సూర్యప్రకాష్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్‌ తదితరులు పాల్గొన్నారు. 

ముగ్గురు ముఖ్యమంత్రులు
నదీ జలాల వాటాలు, పంపకాల విషయంలో ఇటు రాష్ట్రాల మధ్య, అటు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో గోదావరి నది పరివాహక ప్రాంతానికి  చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనడంపై ఆసక్తికరమైన చర్చ సాగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరా>్వత మహారాష్ట్ర ప్రభుత్వంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్నేహ పూర్వకంగా నెరిపిన దౌత్య సంబంధాలు ఫలించాయి. గోదావరి జలాలు ప్రతీ ఏటా వేల టీఎంసీల చొప్పున సముద్రం పాలు కావడం కన్నా సమర్థవంతంగా వాడుకునేందుకు ప్రాజెక్టులు నిర్మించుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆసక్తిగా మారింది.

అతిథులు, బ్యాంకర్లకు సన్మానం 
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులు గవర్నర్‌ నరసింహన్, ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్‌ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా వారికి ఘనస్వాగతం పలికిన కేసీఆర్‌ వెళ్లేటప్పుడు హెలీకాప్టర్‌ వరకు వెళ్లి మరీ ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక సహకారం అందించిన బ్యాంకుల ప్రతినిధులను కూడా ముఖ్యమంత్రి సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఆంధ్రా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ జె.పక్రిసామి, ఇండియన్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎంకే.భట్టాచార్య, ఆర్‌ఈసీ లిమిటెడ్‌ డైరెక్టర్‌(టెక్నికల్‌) ఎస్‌.కే.గుప్తా, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌(కమ్యూనికేషన్స్‌) పీ.కే.సింగ్

అలహాబాద్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.రామచంద్ర, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాలకృష్ణ అల్సె, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హేమంత్‌ కుమార్‌ తమ్తా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ బినోద్‌ కుమార్, నాబార్డ్‌ సీజీఎం విజయ్‌ కుమార్, కార్పొరేషన్‌ బ్యాంక్‌ డీజీఎం అండ్‌ జోనల్‌ హెడ్‌ ఎం.జే.అశోక్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ హెడ్‌ హైదరాబాద్‌ ఎస్‌.వీ.రామకష్ణ, ఆంధ్రా బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ శ్యామల్‌ గోష్‌ రె, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏజీఎం మహ్మద్‌ మక్సూద్‌ అలీ, ఇండియన్‌ బ్యాంక్‌ జోనల్‌ మేనేజర్‌ ఆర్‌.మనోహర్‌ తదితరులు సన్మానం అందుకున్న వారిలో ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top