కీలకమైనవి గాలికొదిలేశారు: లక్ష్మణ్‌

K Laxman Slams Telangana Budget In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది మోసపూరిత, అబద్దాల బడ్జెట్‌ అని అభివర్ణించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంకెల గారడీతో బడ్జెట్‌ను మసిపూసి మారేడు కాయలా చేశారన్నారు. బడ్జెట్‌ బారెడు- ఖర్చు చారెడుగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తలసారి ఆదాయం చెప్పిన ప్రభుత్వం అప్పును ఎందుకు చెప్పడం లేదు? లోటును ఎలా పూడ్చుతారో చెప్పలేదేంటని వరుస ప్రశ్నలు సంధించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, డబుల్‌ బెడ్‌రూం.. ఇలా కీలకమైనవాటిని గాలికొదిలేశారన్నారు. ఉద్యోగ నొటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కొక్కరి తలపై రూ.91వేలు అప్పు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని విమర్శించారు. (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?)

‘నిరుద్యోగ భృతి అని చెప్పి ఏడాదిన్నర కావొస్తున్నా అతీగతి లేదు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వకుండా... తాజాగా డబ్బులు ఇస్తామని కొత్త మోసం చేయబోతున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఎన్నికలు ఉన్నందున నగరానికి రూ.పది వేల కోట్లు అంటున్నారు. ఇది పచ్చి మోసం. డబ్బులు లేవని ఆస్తులను అమ్మే వారు ఏ రకంగా ఆదర్శప్రాయులో వారే చెప్పాలి. రాష్ట్రంలో ఆర్థిక మందగమనం లేదు. ఉన్నదల్లా కేసీఆర్ మందగమనమే. కేంద్రం మీద సాకు చూపి వీరి అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నారు. నిరుద్యోగ, ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో పార్టీ నేతృత్వంలో ఉద్యమం చేపడతాం. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. ఏమైంది? కరోనాకు పారాసిటమాల్ మందును డాక్టర్ కేసీఆర్ కనుగొన్నారా? కేసీఆర్‌.. ఎంఐఎంకు తలొగ్గి సీఏఏపై తీర్మానం అంటున్నారు’ అని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. (రోహింగ్యాలకు పింఛన్లా?)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top