జ్యోతి పట్టు వీడేనా..? | jyothi still not took charge of the bhadrachalam temple | Sakshi
Sakshi News home page

జ్యోతి పట్టు వీడేనా..?

Jul 27 2014 2:40 AM | Updated on Nov 6 2018 6:01 PM

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ఈఓగా కూరాకుల జ్యోతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా నేటి వరకు ఆమె బాధ్యతలు స్వీకరించలేదు.

భద్రాచలం టౌన్:  భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ఈఓగా కూరాకుల జ్యోతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా నేటి వరకు ఆమె బాధ్యతలు స్వీకరించలేదు. భద్రాచలం వచ్చేందుకు ఆమె సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ‘పట్టు విడవకుండా’ ఆమె హైదరాబాద్‌లోనే ఉండేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

 హైదరాబాద్‌లో దేవాదాయశాఖలో మొన్నటి వరకు ఇన్‌చార్జ్ కమిషనర్‌గా, విజిలెన్స్ అధికారిణిగా ఉన్నతస్థాయి విధులు నిర్వహించిన ఆమెను ఆర్‌జేసీ కేడర్‌లో ఉన్న భద్రాచలం దేవస్థానం ఈఓగా బదిలీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. అదీకాక అవినీతి ఆరోపణలతో పనిస్మెంట్‌గా ఆమెను భద్రాచలం బదిలీ చేసినట్లు ప్రచారం జరుగున్న నేపథ్యంలో ఇక్కడ విధుల్లో చేరేందుకు ఆమె సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.

 భద్రాచలం ఈఓగా బాధ్యతలు స్వీకరిస్తే ఆ తప్పులు ఒప్పుకున్నట్లు ఉంటుందని భావించిన ఆమె ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడడం లేదని, అవసరమైతే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరోపక్క తాను పని చేసిన ఇన్‌చార్జ్ కమిషనర్ పోస్టులో తెలంగాణకు చెందిన తనను కాదని ఆంధ్రకు చెందిన మహిళా అధికారిణిని నియమించడంతో ఆమె మరింత పట్టు పట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం, ఉన్నతాధికారులు భద్రాచలం వెళ్లేలా జ్యోతిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

 ఆలయంలో పట్టు తప్పిన పాలన..
 కొద్ది సంవత్సరాలుగా దేవస్థాన పరిపాలన అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆలయ బాధ్యతలు స్వీకరించిన ఈఓలు కుటుంబాలతో ఇక్కడ ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో వారంలో కొద్ది రోజులు మాత్రమే సిబ్బందికి, భక్తులకు అందుబాటులో ఉంటున్నారు. దీనిని అలుసుగా తీసుకున్న కొంతమంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆజాద్ ఈఓగా పనిచేసి వెళ్లిన తర్వాత వచ్చిన రామచంద్రమోహన్, బద్రినారాయణాచార్యులు, రఘునాథ్, ప్రస్తుతం ఇన్‌చార్జ్ ఈఓగా పని చేస్తున్న రమేష్‌బాబులు కూడా ఇక్కడ నివసించడం లేదు.

 ప్రస్తుతం ఇన్‌చార్జ్ ఈఓగా పని చేస్తున్న రమేష్‌బాబు వరంగల్ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తూ ఉండడంతో రామాలయంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదు. భక్తులకు, వీఐపీలకు, సిబ్బందికి అందుబాటులో లేకపోవడంతో దాని ప్రభావం పాలనపై పడుతోంది. దీనికి తోడు వచ్చిన ప్రతీ ఈఓ కూడా తనకు అనుకూలంగా ఉండేలా సిబ్బందిని మారుస్తున్నారు. దీంతో ఏ ఒక్క ఉద్యోగి కూడా ఒక్కో శాఖలో పూర్తిగా నాలుగు నెలలు కూడా పని చేయడం లేదు. దీని వల్ల సిబ్బంది కూడా ఏ శాఖపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.  

 పుష్కర ఏర్పాట్లపై ప్రభావం..
 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూలై నెలలో జరుగనున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగనున్న ఈ పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుంభమేళాస్థాయిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పుష్కరాలకు ఇతర ప్రాంతాల కంటే భద్రాచలానికి అత్యధికంగా కోటిన్నర మంది వరకు వస్తారనే అంచనాతో అధికారులు ఉన్నారు.

 ఈ  మేరకు కలెర్టర్ శ్రీనివాస శ్రీనరేష్, జేసీ సురేంద్రమోహన్‌లు ఇటీవల భద్రాచలంలో సమీక్ష ఏర్పాటు చేసి ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. ఈ పనులలో సింహభాగం బాధ్యత దేవస్థాన అధికారుల మీదే ఉంటుంది. అయితే ఈ ప్రణాళికలు, తదితర పనులను రామాలయ ఈఓ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈఓ రమేష్‌బాబు దేవాదాయ శాఖ డీసీగా బాధ్యతలు నిర్వహిస్తుండడంతో పూర్తిస్థాయిలో ఇటు దృష్టిసారించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు, అధికారులను పర్యవేక్షిస్తూ ఆలయ పాలనను గాడిలో పెట్టేందుకు పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేందుకు ఈఓ అవసరం. అందుకు ఆర్‌జేసీ క్యాడర్‌లో ఉన్న అధికారి ఈఓగా రాకపోతే ఆ ప్రభావం పుష్కరాలపై పడుతుందని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement