
గోదావరి పాత వంతెనపై లక్షలాది వాహనాల రాకపోకలు
ఎన్ని వరదలు వచ్చినా తట్టుకున్న నిర్మాణం
కొత్త వంతెన నిర్మించాక తగ్గిన ఒత్తిడి
పాత వంతెనకు నేటితో 60 ఏళ్లు పూర్తి
భద్రాచలం అర్బన్: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి రావాలంటే ఏళ్ల క్రితం అనేక కష్టాలు ఎదురయ్యేవి. వాహనాల రాకపోకలు సరిగ్గా లేక.. మధ్యలో గోదావరి దాటాలంటే ప్రాణాలకు తెగించాల్సి వచ్చేది. ఏటా శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులు భద్రాచలం గోదావరి అవతల బూర్గంపాడు మండలం గొమ్మూరు నుంచి కాలినడకన, ఆపై పడవలో ప్రయాణించేవారు. అలా వస్తున్న 150 మంది భక్తులు ఒకసారి నీట మునగడంతో.. వారధి నిర్మాణం ఆవశ్యకతను పాలకులు గుర్తించారు. ఈ మేరకు గోదావరిపై నిర్మించిన తొలి వంతెనకు ఈనెల 13వ తేదీతో 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనమిది.
ఆ ప్రమాదంతో నిర్మాణానికి అడుగులు
1959లో శ్రీరామనవమి ఉత్సవాలకు భక్తులు రెండు పడవలను కట్టుకుని గోదావరి నదిపై ప్రయాణం ప్రారంభించారు. అయితే, వరద ఉధృతితో వారి పడవలు మునిగిపోగా.. సుమారు 150 మంది మృతి చెందారు. దీంతో స్పందించిన నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1959 డిసెంబర్ 16న శంకుస్థాపన చేశారు. వంతెన డిజైన్, నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను ముంబైకి చెందిన పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్‌కు అప్పగించారు. ఆపై అనేక అవాంతరాల నడుమ వంతెన నిర్మాణం సాగుతూ ఆరేళ్లకు పూర్తవగా.. 1965 జూలై 13న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు.
అప్పట్లో రూ.70 లక్షలతో నిర్మాణం
భద్రాచలం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి రూ.70 లక్షలు వెచి్చంచారు. దీన్ని 3,934 అడుగుల పొడవు, 37 పిల్లర్లు, ఒక్కొక్క పిల్లర్ మధ్య 106.6 అడుగుల దూరంతో.. ముంబైకి చెందిన పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ ఆధ్వర్యాన నిర్మించారు. ఈ వంతెనపై ఇన్నాళ్లూ లక్షలాది వాహనాల రాకపోకలు సాగినా పటిష్టంగానే ఉండడం విశేషం.
ఈ వంతెనకు ఇంకా సామర్థ్యం ఉన్నా.. జాతీయ రహదారి కావడంతో.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా పక్కనే మరో వంతెన నిర్మించారు. కొత్త వంతెన నిర్మాణానికి 2015లో శ్రీకారం చుట్టగా 2024లో శ్రీరామనమి వేడుకల వేళ అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్త వంతెన నిర్మాణానికి రూ.100 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేయగా.. ముంబైకే చెందిన రాజ్‌దీప్ సంస్థ పనులను దక్కించుకుని 2024 నాటికి పూర్తిచేసింది.
నాలుగు రాష్ట్రాల ప్రజలకు సదుపాయం
భద్రాచలంలో గోదావరిపై 1965లో అందుబాటులోకి వచ్చిన వంతెన ద్వారా నాలుగు రాష్ట్రాల ప్రజలకు రవాణా సదుపాయం ఏర్పడింది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వచ్చివెళ్లే వారికి ఇది వారధిగా నిలుస్తోంది. అప్పుడప్పుడు చిన్న చిన్న మరమ్మతులు తప్ప ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కాగా, 1986లో మొదటిసారి గోదావరికి 75.6 అడుగుల వరద వచ్చినప్పుడు.. ఉన్నతాధికారులు వంతెనపై రాకపోకలను నిషేధించారు. మళ్లీ 2022లో కూడా అంటే దాదాపు 36 ఏళ్ల తర్వాత భారీగా వరద రావడంతో రాకపోకలను కొన్నాళ్లు నిలిపివేశారు.
ఎన్నో వరదలకు ప్రత్యక్ష సాక్షి
భద్రాచలం వద్ద గోదావరి వరద ఆరున్నర దశాబ్దాల్లో పలుమార్లు తొలి ప్రమాద హెచ్చరికను దాటింది. ఎప్పుడూ జూలైలోనే గోదావరి నది 11 సార్లు తొలి ప్రమాద హెచ్చరికను దాటడమే కాకుండా.. నాలుగుసార్లు మూడో ప్రమాద హెచ్చరికను (53 అడుగులు) సైతం దాటడం గమనార్హం. 1972 జూలై 6న 44.3 అడుగులుగా గోదావరి నీటిమట్టం నమోదైంది.
1976 జూలై 22న 63.9 అడుగులు, 1986లో 75.6 అడుగులు, 1988 జూలై 29న 54.3, 2002 జూలై 27న 45.8, 2008 జూలై 6న 47.3, 2013 జూలై 19న 57, 2013 జూలై 24న 56.7, 2016 జూలై 12న 52.4 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఇక 2022లో జూలై 16న 71.3 అడుగులుగా నీటిమట్టం నమోదు కాగా, 2023లో జూలై 29న 56.1, 2024లో జూలై 27న 53.9 అడుగులుగా నమోదైంది. వరదలే కాక గోదావరి ఎండిపోయి ఇసుక తిన్నెలు తేలడానికి కూడా ఈ వంతెన సాక్షిగా నిలిచింది.