
48 అడుగులకు చేరిననీటిమట్టం
గంటగంటకూ గోదారికి పెరుగుతున్న వరద ఉధృతి
సాక్షి, హైదరాబాద్ /సాక్షి, నెట్‌వర్క్: గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. గతవారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఉపనదులైన సింగూరు, పెన్‌గంగా, వార్ధా, ప్రాణహిత, ఇంద్రావతి, తాళిపేరు, కిన్నెరసాని పరవళ్లు తొక్కుతుండడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరనుందని అంచనాలతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) యెల్లో హెచ్చరిక జారీ చేసింది. రాత్రి 10:05 గంటలకు భద్రాచల వద్ద నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
» సింగూరు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఎగువ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని జైక్వాడ్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 102.73 టీఎంసీలు కాగా, నీటి నిల్వలు 98.93 టీఎంసీలకు చేరాయి.
» సింగూరు ప్రాజెక్టులో18.69 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు.ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, డ్యామ్ భద్రతపై హెచ్చరికల నేపథ్యంలో వరద పెరిగిన కొద్దీ నిల్వలను క్రమంగా తగ్గిస్తున్నారు.
» నిజాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, నీటినిల్వలు 15.32 టీఎంసీలకు చేరాయి.
» గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, 70.42 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తున్నారు.
» కాళేశ్వరం పుష్కర ఘాటు వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం 104.11 మీటర్ల ఎత్తులో నీటిమట్టం చేరింది.
» ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3.2లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. జలాశయ నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 15 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 40 గేట్లను పైకెత్తడం ద్వారా 1.97 లక్షల క్యూసెక్కుల వరదను కిందకు విడుదల చేస్తున్నారు.
» దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్‌కు 4.2 లక్షలు, అన్నారం బరాజ్‌కు 5.04 లక్షలు, మేడిగడ్డ బరాజ్‌కు 10.43 లక్షలు, సమ్మక్కసాగర్‌కు 11.21 లక్షలు, సీతమ్మసాగర్‌కు 10.49 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిందివచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. ఈ బరాజ్‌ల గేట్లన్నింటినీ ఎత్తి ఫ్రీ ఫ్లోలో ఉంచడంతో గోదావరి వరద స్వేచ్ఛగా కడలి దిశగా పరుగెడుతోంది.
» పెద్దపల్లి జిల్లా పార్వతీ బరాజ్‌కు వరద తాకిడి పెరగడంతో అప్రమత్తమైన అధికారులు.. మొత్తం 74 గేట్లు ఎత్తి దిగు వకు నీటిని విడుదల చేశారు. గోదావరి తీరంలోని సిరిపురం, గుంజపడుగు, పోతారం, విలోచవరం, ఉప్పట్ల తదితర గ్రామాల్లోని 200 ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి.
» ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటి ప్రవాహం 16.20 మీటర్లకు చేరింది. 17.33 మీటర్లకు చేరితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. వరద ఉధృతికి పరీవాహక ప్రాంతాలైన ఓడవాడ, దళితకాలనీ ప్రాంతాల్లోని ప్రజలను క్రాస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రమైన గిరిజన భవన్‌కు తరలించారు. వాజేడు మండలం టేకులగూడెం చివరన 163 నంబరు జాతీయ రహదారిపైకి వరద పెరగడంతో రాక పోకలు నిలిచిపోయాయి.
పోటెత్తిన కృష్ణా
కృష్ణానదికి కూడా వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను ఎత్తారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 881.8 అడుగుల వద్ద 197.9120 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి 4,85,877 క్యూసెక్కుల నీరు సాగర్‌లోకి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 16 రేడియల్ క్రస్ట్‌గేట్లను 13 అడుగులు, 10 గేట్లను 10 అడుగులు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. నాగార్జునసాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590.00 అడుగులు (312.0450టీఎంసీలు). ప్రస్తుతం 583.70 అడుగులు (293. 6854 టీఎంసీలు) ఉంది.