‘అగ్రిగోల్డ్‌’ పరిష్కారంలో జాప్యం సరికాదు

Justice Lakshman Reddy Comments about Agri Gold victims case - Sakshi

హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణరెడ్డి 

హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ బాధితుల కేసు కోర్టులో ఉందని సాకు చూపుతూ వారి సమస్యను పరిష్కరించడంలో జాప్యం చేయడం సరికాదని, సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తానంటే ఏ కోర్టూ అభ్యంతరం తెలపదని హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అప్పుల్లో ఉన్నా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నా రూ.1,150 కోట్లు అగ్రిగోల్డ్‌ బాధితులకు మంజూరు చేసిందని, తెలంగాణలోని బాధితులకు రూ.500 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని, దీనిలో ముందుగా రూ.300 కోట్లు మాత్రమే కేటాయించాలని కోరుతున్నారని అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ కూడా సానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేష్‌బాబు, అడ్వొకేట్‌ శ్రవణ్‌కుమార్‌ అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

సమావేశానికి జస్టిస్‌ లక్ష్మణరెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్, సీపీఐ నగర కార్యదర్శి ఇ.టి.నర్సింహ హాజరయ్యారు. జస్టిస్‌ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ సంస్థ నిర్వాహకులను ప్రభుత్వం అప్పుడే అరెస్టు చేసి ఉంటే బాగుండేదని, కానీ ఉదాసీనంగా వ్యవహరించడంతో వారు తమ ఆస్తులను బినామీల పేరిట బదలాయించారని, ప్రస్తుతం తమ వద్ద ఏమీ లేదని అంటున్నారని, ఇందులో ప్రభుత్వ తప్పు కూడా ఉందన్నారు. బాధితుల్లో 95% మంది పేదవారేనని, ప్రభుత్వం ఎన్నింటికో ఎన్నో ఖర్చు చేస్తున్నదని, రూ.500 కోట్లు బాధితులకు ఇవ్వాలన్నారు. ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌లో శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణంలో మోసపోయిన బాధితులకు అక్కడి ప్రభుత్వం న్యాయం చేసిందని, ఆ సంస్థ ఆస్తులను జప్తు చేసి బాధితులకు ఇచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణలో కూడా అగ్రిగోల్డ్‌ ఆస్తులను జప్తు చేసి బాధితులకు ఇవ్వాలన్నారు.   

ధనిక రాష్ట్రంలో రూ.500 కోట్లు ఇవ్వలేరా
ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని, బాధితులకు రూ.500 కోట్లు ఇవ్వడం పెద్ద సమస్య కాదని అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో ప్రాజెక్టులు, నీళ్లు, పంపకాలపై సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ సమస్యపై కూడా దృష్టి సారించాలన్నారు. నర్సింహ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసేందుకు ఎందుకు వెనకాడుతున్నదని ప్రశ్నించారు. ఇటీవల 27 మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, వారి సీటుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేష్‌ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదేళ్లలో ఎన్ని పోరాటాలు చేసినా స్పందించలేదని, జగన్‌ మేనిఫెస్టోలో చేర్చగానే అధికారంలోకి వచ్చారన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top